సాక్షి, నిజామాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నిజామాబాద్‌పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇక, కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆమె భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు.
ఇదే సమయంలో కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి బదిలీ అయిన కీలక అధికారితో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగిపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాల సేకరణ తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment