‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం | Rs 340 crore electronics manufacturing cluster approved in Telangana | Sakshi
Sakshi News home page

‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం

Published Tue, Jan 9 2024 2:22 AM | Last Updated on Tue, Jan 9 2024 7:45 AM

Rs 340 crore electronics manufacturing cluster approved in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్ల (ఈఎంసీ)లో కామన్‌ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని టీవర్క్స్‌లో ఏర్పాటు చేసే క్లస్టర్‌కయ్యే వ్యయం రూ. 104.63 కోట్లుకాగా అందులో రూ. 75 కోట్లను గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌గా అందించనున్నట్లు వెల్లడించింది.

ఈ క్లస్టర్‌కు ఈ నెల 4న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి వద్ద ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రం త్వరలో అనుమతిస్తుందని... క్లస్టర్‌ మంజూరు చేయాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ప్రధాన సమాచార ప్రతినిధి స్పష్టం చేశారు.

ఐటీఐఆర్, ఎల్రక్టానిక్‌ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందనగా కేంద్రం ఈ వివరాలు ఇచ్చింది. దివిటిపల్లిలో రూ. 568.9 కోట్లతో ప్రతిపాదించిన ఈఎంసీకి రూ. 264.6 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రెండింటిని ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ 2.0 కింద మంజూరు చేసినట్లు పేర్కొంది. 

ఐటీఐఆర్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రతిపాదనలు పంపలేదు.. 
ఏపీ విభజన హామీగా తెలంగాణకు ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)’ఏర్పాటు హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. అయితే ఐటీఐఆర్‌పై 2016లో సమావేశం జరిగిందని... ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వివరాలు ఇవ్వలేదని ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో కేంద్రం స్పష్టం చేసింది.

2013 నవంబర్‌ 13న ఐటీఐఆర్‌ క్లస్టర్‌ను నోటిఫై చేశారని, ఈ క్లస్టర్‌లో రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివర నివేదిక ఇవ్వాల్సి ఉందని, కానీ తదుపరి డీపీఆర్‌లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఐటీఐఆర్‌పై 2016లో ఒకసారి, 2017లో మరోసారి సమావేశం జరిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి తదుపరి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో తాము ఆమోదించలేకపోయామని ఆ సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది.

2017లో ఐటీఐఆర్‌ పాలసీ, కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీపై సమీక్షించగా ఐటీఐఆర్‌లో ఉన్నవే కేంద్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఉన్నందున ఐటీఐఆర్‌లను పక్కనపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఐటీఐఆర్‌ ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నుంచి 2021 జనవరి 7న లేఖ అందిందని, అప్పటికే హైదరాబాద్, మహేశ్వరంలో ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లకు అనుమతిచ్చామని తెలియజేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఐటీఐఆర్‌తో సంబంధం లేకుండా ఈఎంసీ 2.0 కింద తాజాగా రెండు క్లస్టర్లను మంజూరు చేశామని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందిస్తూ బదులిచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement