మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపూర్‌లో పూర్తయిన రైతువేదిక భవనం
కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పుడమి బిడ్డల సేవ కోసం రైతువేదికలు సిద్ధమవుతున్నాయి. ఈపాటికే మహబూబ్‌నగర్ మండలంలోని వెంకటాపూర్‌లో పూర్తయింది. రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించారు. కలెక్టర్ వెంకట్రావ్ సైతం నిరంతరం పర్యవేక్షిం చారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మిగిలిన రైతువేదికల్లోనూ వేగం పెంచారు.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా 88 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో దాని పరిధిలో ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నారు. వీటన్నింటిని దసరా పండుగ నాటికి పూర్తిచేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను సైతం నియమించిన విషయం విదితమే. ఈ క్లస్టర్లలో రైతువేదికలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ నేతృత్వంలో అధికారులు యుద్ధప్రాతిపదికన అనువైన స్థలాలను గుర్తించి పనులు మొదలుపెట్టారు. పంటల సాగు, వ్యవసాయంలో పాటించాల్సిన మెళకువలను రైతులకు వివరించడం, సమావేశాల నిర్వహణ, చైతన్య కార్యక్రమాలు జరపడానికి వీలుగా ఈ వేదికలు ఉంటాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో సుమారు 2,500మంది రైతులకు మేలు చేకూరనుంది.
జిల్లాలోని 15 మండలాల్లో..
మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పట్టణ ప్రాంతం కావడంతో ఎదిర రెవెన్యూ గ్రామంలో ఒకే రైతువేదికను నిర్మిస్తున్నారు. పంటల సాగులో ఉన్న మండలాల్లో మాత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు నిర్మిస్తున్నారు. ఒక్కో దాని కోసం రూ.22 లక్షలు వెచ్చిస్తున్నారు. మొత్తం 88 వేదికలను రూ.19.36 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రతి వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తే చుట్టూ ప్రహరీ నిర్మించాలని యంత్రాంగం యోచిస్తోంది. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం సేకరించారు. భూమి లభ్యత ఉన్న చోట ఎకరం కేటాయించారు. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించారు.
భూసార పరీక్షలు సైతం..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 55క్లస్టర్లలో భూసార పరీక్ష కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పంట మార్పిడి కోసం భూసార పరీక్షలు కీలకం అవుతున్నాయి. దీంతో పరీక్షలను విస్తృతం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో ఒకటి చొప్పున భూసార కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
దసరాకు పూర్తవుతాయి
జిల్లాలో రైతువేదికల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా నాటికి అన్ని వేదికలు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రైతులకు అన్నివిధాలా ఉపయోగపడే రీతిలో వీటిని నిర్మిస్తున్నాం. – సుచరిత, డీఏఓ
Comments
Please login to add a commentAdd a comment