సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రులు, క్లీనిక్‌లలో అసలేం జరుగుతోంది? నిజంగా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేవన్నీ పాజిటివ్ కేసులేనా? నెగెటివ్ రిపోర్టులన్నీ వాస్తవంగా నెగటివ్ కేసులేనా? కాసుల కక్కుర్తితో ఆస్పత్రులు రిపోర్టుల్ని తారుమారు చేస్తున్నాయా? అసలు శాంపిళ్లే తీసుకోకుండా... టెస్టులే చేయకుండా రిపోర్టులు ఇస్తున్నారా? అసలే కరోనా భయంతో నిత్యం చస్తూ బతుకీడుస్తుంటే మీరు కొత్త అనుమానాలు ఎందుకు సృష్టిస్తున్నారు? అవును నిజమే హైదరాబాద్‌లో కరోనా రిపోర్టుల విషయంలో పెద్ద గోల్‌మాల్ నడుస్తోంది. సాక్షి సీక్రెట్ కెమెరాలో ఆ తతంగం బయటపడింది.
కరోనా పేరుతో హైదరాబాద్‌లో పలు ఆస్పత్రులు, క్లీనిక్‌ల మాటున ఫేక్ రిపోర్టుల దందాకు తెరలేపాయి. టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు ఇస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. ఫేక్ సర్టిఫికేట్‌కు ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోరేటు, క్లీనిక్‌లో ఇంకోరేటు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ‘‘శాంపిల్స్ లేవు.. టెస్టులు అవసరం అసలే లేదు.. నెగిటివ్ కావాలంటే నెగిటివ్, పాజిటివ్ కావాలంటే పాజిటివ్... నకిలీ రిపోర్ట్‌లతో మీరు ఏమైనా చేసుకోండి, ఎక్కడికైనా వెళ్లండి’’ అన్నట్లుగా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. (చదవండి: డ్రైరన్, వాక్సినేషన్‌కు తేడా ఏమిటి..? )
లక్షలు వసూలు చేశారు
రక్షా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎల్బీ నగర్‌లో ఉంది. ఇందులో అన్ని దొరుకుతాయి. గతంలో కరోనా పేషెంట్లకు చికిత్స పేరు చెప్పి లక్షలు వసూలు చేసిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చినా అధికారులు నిమ్మకునీరెత్తిన్నట్లు ఉన్నారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు కూడా తన దందాను కొనసాగిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. అసలు ఈ ఆస్పత్రికి కరోనా చికిత్సకు అనుమతి కూడా లేదని తెలుస్తోంది. అనుమతి లేని ఈ ఆసుపత్రిలో అక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాక్షి ప్రతినిధి తమ స్నేహితులకు టెస్టులు నిర్వహించకుండా ఓ నెగిటివ్ రిపోర్టు కావాలని అడిగారు. అడిగిందే ఆలస్యం దాంట్లో ఏముంది ఇచ్చేద్దాం అని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో నెగిటివ్ రిపోర్టుకు 2 వేల ఐదు వందల రూపాయలు, పాజిటివ్ రిపోర్టుకు 3 వేల రూపాయలు అవుందని బేరం కుదుర్చుకున్నాడు.
అక్కడ ఐదొందలు తక్కువ
ఇక రక్ష మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కేంద్రంగా నడుస్తున్న బాగోతం ఇలా ఉంటే యూసుఫ్‌గూడలో ఉన్న మరో క్లీనిక్ బాగోతం మరోలా ఉంది. ఇక్కడ కూడా ఫేక్ సర్టిఫికెట్లు విచ్చలవిడిగా ఇస్తారు. కాకపోతే రక్ష ఆస్పత్రితో పోలీస్తే ఓ ఐదు వందలు తక్కువ. ఈ రెండు ఆస్పత్రులే కాదు... నగరంలో జరుగుతున్న కరోనా విచ్చలవిడి నకిలీ దోపిడి గురించి విన్న వారికి ఎవరికైనా గుండెళ్లో రైళ్లు పరిగెత్తక మానదు. అసలు ఇన్నాళ్లు సామాన్యుల రక్తాన్ని జలగల్లా తాగిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో నెగటివ్ వచ్చిన వారికి కూడా పాజిటివ్ అని నకిలీ రిపోర్టులు సృష్టించి లక్షలకు లక్షలు లాగారా అన్న అనుమానం కలుగకమానదు.
ఈ ఫేక్ సర్టిఫికేట్ల ఇంత విచ్చలవిడిగా బహిరంగంగా ఇస్తుంటే వీటి వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో ఓసారి ఊహించుకోండి. వారు ఇస్తున్న నకిలీ నెగటివ్ సర్టిఫికేట్‌ను తీసుకుని నిజంగా ఆఫీస్‌కు వెళ్తే ఒకవేళ ఆ వ్యక్తికి పాజిటివ్ వస్తే ఆ ఆఫీస్‌లో ఉండే మిగతా ఉద్యోగుల పరిస్థితి గురించి ఆలోచించండి. ఇక నకిలీ పాజిటివ్ సర్టిఫికేట్ పెట్టి అక్రమాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నకిలీ దందా చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే ఇప్పటికే యూకే స్ట్రెయిన్ కేసులతో కలవరపాటుకు గురవుతున్న ప్రజలు ఈ ఫేక్ రాయుళ్ల ధనదాహం కారణంగా మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment