సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు చివరి పని దినాన్ని, వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటిం చింది. ఈనెల 26వ తేదీని ఆయా విద్యా సంస్థలకు చివరి పని దినంగా పేర్కొంది. 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులపై ఆదివారం ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కాలేజీల ప్రారంభంపై జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెనువెంటనే చివరి పని దినం, సెలవులపై ఇంటర్మీడియట్ బోరుŠడ్ కార్యదర్శి, పాఠశాల విద్య ఇంచార్జి డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
పది రోజులుగా కోరుతున్న నేపథ్యంలో...
రాష్ట్రంలో కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్/డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించిన ప్రభుత్వం గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించింది. అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ఓకే చెప్పింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రత్యక్ష విద్యా బోధనను నిలిపివేసింది. అంతేకాదు మే 1 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 17 నుంచి నిర్వహించాల్సిన టెన్త్ పరీక్షలపైనా ఈ నెల 15నే నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతోపాటు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా సెలవులు ఇవ్వాలని, పెరుగుతున్న కరోనా కేసుల వల్ల పాఠశాలలకు వెళ్లి రావాలంటే భయంగా ఉందని టీచర్లంతా వాపోయారు. తాము స్కూళ్లకు వెళ్లి చేసేదేమీ లేకపోగా, కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది.
ఆ విద్యార్థులంతా పాస్: సబితా ఇంద్రారెడ్డి
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసి, 5,46,865 మందిలో పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇపుడు 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53,79,388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. వారికి పరీక్షలేమీ ఉండవని స్పష్టంచేశారు. మొత్తంగా 59,26,253 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.
తరగతుల వారీగా నమోదైన విద్యార్థులు
తరగతి విద్యార్థుల సంఖ్య
1 60,5,586
2 6,23,571
3 6,37,563
4 6,28,572
5 6,14,862
6 5,86,231
7 5,77,412
8 5,60,417
9 5,45,174
10 5,46,865
Comments
Please login to add a commentAdd a comment