సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నప్పటికీ... విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మతిస్తేనే ఆఫ్‌లైన్ తరగతుల హాజరుకు (ప్రత్యక్షంగా స్కూలుకు రావడానికి) అనుమతి ఉంటుంది. పిల్లల్ని బడికి పంపించొద్దని పేరెంట్స్ భావిస్తే... వారి కోసం ఆన్‌లైన్ తరగతులు, వీడియో పాఠాలు యథాతథంగా కొనసాగుతాయి. తల్లిదండ్రులు తమ అభీష్టం మేరకు ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్ పద్ధతిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. గతంలో మాదిరిగా విద్యా సంస్థలన్నీ సాధారణ పనివేళల్లో కొనసాగనున్నప్పటికీ... విద్యార్థులు మాత్రం తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఫిజికల్‌గా హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం లిఖితపూర్వకంగా తమ సమ్మతి తెలపాలి. తొమ్మిదో తరగతి నుంచి పైతరగతులకు బోధించే ఉపాధ్యాయులు మాత్రం ప్రతి రోజూ పాఠశాలకు హాజరు కావాలి. తరగతి గది విస్తీర్ణాన్ని బట్టి ఆరు అడుగుల దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి విద్యార్థి మాస్కు ధరించడంతో పాటు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ విద్యా సంస్థలను నిర్వహించాలని సూచిస్తూ... సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉన్నత పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికి సంబంధించిన ఆదేశాలను ఇందులో వివరంగా ప్రస్తావించింది.
పర్యవేక్షణకు డీఎల్‌ఈఎంసీ
విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్‌ఈఎంసీ)లకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్‌ఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, డీఈఓ, డీఐఈఓ, ఎంపిక చేసిన కాలేజీల ప్రిన్సిపాళ్లు, కలెక్టర్ సూచించిన వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల నిర్వహణకు సం బంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తారు. విద్యా సంస్థల శానిటైజేషన్, తరగతుల నిర్వహణ ఏర్పాట్లు, వైద్య ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నీ జిల్లా కమిటీల ఆదేశానుసారం అమలు చేస్తారు. కేంద్రం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ)ను పర్యవేక్షిం చేందుకు జిల్లా కలెక్టర్లు నోడల్ ఆఫీసర్లను నియమించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యా హ్న భోజన పథకాన్ని కోవిడ్–19 జాగ్రత్తలు పాటిస్తూ అమలు చేయాలని ఆదేశించింది.
సంక్షేమ మంత్రులతో ప్రత్యేక సమీక్ష
రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలు దాదాపు వెయ్యికిపైగా ఉన్నాయి. పాఠశాలలు మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకుల కాలేజీల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులున్నారు. ఆయా సంక్షేమ శాఖల మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న సంక్షేమ శాఖల మంత్రులతో తరగతులు, వసతిగృహాల నిర్వహణపై విద్యామంత్రి సబితారెడ్డి ప్రత్యేక సమీక్ష జరపనున్నారు. అలాగే 19న ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో మంత్రి సమావేశం కానున్నారు.
సిలబస్ పూర్తి ఎలా?
కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం... అందులోనూ ఆన్‌లైన్ తరగతులతో నెట్టుకురావడంతో విద్యార్థుల అభ్యసనపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1నుంచి ప్రత్యక్షబోధన ప్రారంభిస్తే అకడమిక్ క్యాలెండర్ ఎలా ఉండాలనే దానిపై మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు ఎంతవరకు జరిగాయి... ఇంకా ఏమేరకు సిలబస్ చెప్పాల్సి ఉంది? అందుకు ఏమేరకు సమయం పడుతుంది? పాఠ్యాంశాలను కుదించాల్సి వస్తే ఏయే అధ్యాయాలను తొలగించాలి? పరీక్షలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని శాఖల వారీగా అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment