నేటి నుంచే బడులు | Schools In Telangana Reopen Today After Summer Vacation | Sakshi
Sakshi News home page

నేటి నుంచే బడులు

Published Wed, Jun 12 2019 1:53 AM | Last Updated on Wed, Jun 12 2019 10:04 AM

Schools In Telangana Reopen Today After Summer Vacation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వేసవి సెలవులు ముగించుకొని పాఠశాలలు బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. బుడిబుడి అడుగులు వేస్తూ విద్యార్థులు బడులకు వెళ్లనున్నారు. బ్యాగులనిండా పుస్తకాలను వేసుకొని భుజాలు వంగిపోతున్నా రాష్ట్రంలోని 65,29,072 మంది విద్యార్థులు 42,834 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు. మరోవైపు పెరిగిన ఫీజుల భారం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారినా తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించేందుకు సిద్ధమయ్యారు. 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజలను పెంచినా.. వాటిని నియంత్రించే చర్యలు లేకపోవడంతో అప్పులు చేసైనా చెల్లించే ఏర్పాట్లు చేసుకున్నారు. పాఠశాలల్లోనూ సమస్యలు ఎలాగూ దర్శనమిచ్చే పరిస్థితే ఉంది. కొన్ని స్కూళ్లలో బోధించే టీచర్లు లేరు. దాదాపు 15 వేల మంది విద్యా వలంటీర్ల సర్వీసు ఇంకా రెన్యువల్‌ కాలేదు. నాలుగైదు రోజుల్లో వారి నియామకానికి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రిటైర్‌ అయిన స్థానాల్లో విద్యా వలంటీర్లు లేక కొన్ని పాఠశాల్లో టీచర్లు ఉండని పరిస్థితి నెలకొంది. ఆయా పాఠశాలల్లోనూ విద్యా వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపట్టాలని, వర్కర్లను నియమించుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.
 
ఎటూ తేలని ఫీజుల నియంత్రణ... 
ఫీజుల నియంత్రణ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎప్పటిలాగే యాజమాన్యాలు ఈసారి ఫీజులను భారీగా పెంచేశాయి. 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల గతేడాది ఒకటో తరగతికి రూ. 45 వేలు వసూలు చేయగా, ఈ సారి ఆ విద్యార్థి రెండో తరగతికి వచ్చే సరికి రూ.53 వేలకు పెంచింది. కరీంనగర్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో గత ఏడాది ఎల్‌కేజీకి రూ.25 వేలు వసూలు చేయగా, ఈసారి రూ.32 వేలకు పెంచింది. రాష్ట్రంలోని ప్రముఖ పాఠశాలలన్నింటిలో దాదాపు ఇదే పరిస్థితి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. దీంతో గతేడాది ఫీజులను పెంచవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, దానిపై ప్రైవేటు పాఠశాలలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం తాము ఫీజుల నియంత్రణకు తాము చర్యలు చేపడుతున్నామని, తిరుపతిరావు కమిటీ నివేదికపై పరిశీలన జరుపుతున్నామని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినా ఇంకా తీర్పు వెలువడలేదు.  

బ్యాగు బరువుపై చర్యలు శూన్యం 
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు 2017లోనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 22) జారీ చేసింది. కానీ ఉత్తర్వుల అమలుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించిన సందర్భమే లేదు. కేవలం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను డీఈవోలకు పంపి చేతులు దులుపుకున్నారు. దీంతో బ్యాగు బరువు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు ఈ–స్కూల్, టెక్నో కరిక్యులమ్, ఒలంపియాడ్‌ తదితర 65 రకాల ఆకర్షనీయ పేర్లతో విద్యార్థులపై పుస్తకాల బరువుతోపాటు ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రభుత్వ సిలబస్‌ విద్యార్థుల పుస్తకాలకు రూ.600 మించి కాకపోగా ప్రైవేటు స్కూల్స్‌ పుస్తకాలకు కనీసంగా రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. విద్యాశాఖ దీనిపై ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. 

బ్యాగు బరువుపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. 
ప్రైవేటు పాఠశాలల్లో ఎస్‌సీఈఆర్‌టీ నిర్ధేశిత పుస్తకాలనే వాడాలని, పైగా బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోలే బరువు ఉండాలని.. 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలు.., 7 తరగతుల బరువు 4 కిలోలకు మించకూడదని.. 8, 9, 10 తరగతుల బరువు 4.5 నుంచి 5 కిలోల లోపే ఉండాలని స్పష్టం చేసింది. కానీ వాటిని పక్కాగా అమలు చేయడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది.  

ఈనెల 14 నుంచి బడిబాట... 
రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. నిర్వహణ వ్యయం కింద ఒక్కో పాఠశాలకు రూ. 1000 చొప్పున నిధులను విడుదల చేసింది.   ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ నిధుల కొరతతో ఇంకా ఇది క్లాత్‌ కొనుగోలు దశలోనే ఉండటం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement