సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో మూతపడ్డ బడులు... 2020–21 విద్యా సంవత్సరం ప్రారంభమైన 8 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలి. ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకూ అప్పటినుంచే ప్రత్యక్ష విద్యా బోధన మొదలుపెట్టాలి. ఈలోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. విద్యా సంస్థలు పనిచేయక చాలా రోజులు అవుతోంది కాబట్టి అందులోని సామగ్రినంతటినీ శుభ్రపర చాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర వంట సరుకులు పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరిచూసుకోవాలి. మొత్తంగా ఈనెల 25లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
వెంటనే పదోన్నతులు...
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. అప్పుడు జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను కోరారు. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు.
దేశానికే ఆదర్శ పల్లెలు
‘పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఈ ప్రగతి రాష్ట్రానికి గర్వకారణం’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్రం ఏర్పడిన నాడు 84 గ్రామ పంచాయతీలకే సొంత ట్రాక్టర్లు ఉండేవి. నేడు 12,765 గ్రామ పంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు ఉన్నాయి. 19,470 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు గాను... ఇప్పటికే 19,027 చోట్ల స్థలాలను గుర్తించాం. 15,646 చోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. 2,601 రైతు వేదికలకు గాను... ఇప్పటికే 2,580 నిర్మాణం పూర్తయింది. 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం 91 శాతం పూర్తయింది. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. మొదటివిడతగా 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది.
ప్రతినెలా రూ.308 కోట్లు
‘ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని మనం గమనించవచ్చు’అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి అమలు తీరు పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణాన్ని నూటికి నూరుశాతం పూర్తి చేసిన సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావును కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అన్ని గ్రామాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కమిటీలను నియమించాలని చెప్పారు.
అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు
పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పచ్చదనం–పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు. ‘ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించే ఏర్పాటు జరుగుతున్నది. పట్టణాల్లో 2,802 సానిటేషన్ వెహికిల్స్ ఉన్నాయి. మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్‌ను సమకూరుస్తున్నాం. అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామాలు నిర్మించాలి. అవసరమైతే మున్సిపాలిటీల నిధులతో స్థలాలను కొనుగోలు చేయాలి. 116 పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనాభా ఎక్కువ కలిగిన పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలి. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి
బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వలస పక్షులతోనే ఈ వ్యాధి వ్యాపిస్తున్నదన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. మొదటి విడతలో మిగిలిపోయిన 28 వేల మంది లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని కోరారు.
3.67 శాతం పెరిగిన పచ్చదనం
హరితహారంతో తెలంగాణలో మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని సీఎం తెలిపారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలని, స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతున్నదని, ఇంకా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని కోరారు. 127 శాతం మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆ జిల్లా కలెక్టర్ శరత్‌ను ప్రశంసించారు. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా భద్రాద్రి– కొత్తగూడెం నిలిచిందని, ఆ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డిని అభినందించారు.
చదవండి:
జీతాలివ్వండి మహాప్రభో..
‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..!
Comments
Please login to add a commentAdd a comment