బడికి పోయేదెట్లా..! | Government Schoolss Are Opening From Today | Sakshi
Sakshi News home page

బడికి పోయేదెట్లా..!

Published Thu, Aug 27 2020 1:30 AM | Last Updated on Thu, Aug 27 2020 9:51 AM

Government Schoolss Are Opening From Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు సర్కారు బడులు తెరుచుకోనున్నాయి. గురువారం ఉపాధ్యాయులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు ఐదు నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు విద్యార్థులెవరూ పాఠశాలలకు హాజరు కావొద్దని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే, టీచర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న ఉపాధ్యాయులు బడికి ఎలా వెళ్లాలనే ఆందోళనలో పడ్డారు. ప్రస్తుతం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడమే వారి ఆందోళనకు కారణం. ప్రధాన రహదారులలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా గ్రామాలకు, మారుమూల పల్లెలకు మాత్రం వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లాల్సిన టీచర్లు సొంత, ప్రైవేట్‌ వాహనాలపైనే ఆధారపడాలి. కానీ, ప్రైవేట్‌ వాహనాలు కూడా అరకొరే అందుబాటులో ఉన్నాయి.

రవాణా వ్యవస్థ లేక ఇబ్బందులే..
రాష్ట్రంలో 29,343 ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. ఇందులో 26 వేల ప్రభుత్వ, లోకల్‌బాడీ స్కూళ్లు ఉండగా, 1,771 ఆశ్రమ పాఠశాలలు, 475 కేజీబీవీలు, మిగతావి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకులాలున్నాయి. వీటి పరిధిలో 30 లక్షల మంది విద్యార్థులుండగా.. దాదాపు 2 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, జీహెచ్‌ఎంలు దాదాపు 1.5 లక్షల మంది ఉంటారు. గురువారం నుంచి ఈ విద్యా సంస్థలన్నీ తెరుచుకోనుండగా... ఉపాధ్యాయులంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు దాదాపు స్థానికంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారిలో అత్యధికులు మండల కేంద్రాలు, ఇతర పట్టణాల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం రవాణా వ్యవస్థ లేకపోవడం వీరికి ఇబ్బంది కలిగించే అంశమే. సొంత వాహనాల్లో వెళ్లేవారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనాలను వినియోగించనున్నారు. ప్రస్తుతం కోవిడ్‌–19 నేపథ్యంలో ఎవరి వాహనాలను వాళ్లే వినియోగిస్తూ మరో సహోద్యోగికి అవకాశం లేకుండా ఒక్కరు మాత్రమే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మహిళా టీచర్లకు కష్టకాలం...
మహిళా టీచర్లను ప్రస్తుత పరిస్థితి ఇరకాటంలో పడేసింది. వీరిలో చాలామంది ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఇన్నాళ్లూ ప్రయాణించి విధులకు హాజరయ్యేవారు. ప్రస్తుతం వారికి రవాణా ఇబ్బందులు తప్పవు. దూర ప్రాంతంలో ఉన్న స్కూళ్లకు ప్రత్యేకంగా వాహనాన్ని తీసుకెళ్లలేరు. మరోవైపు ప్రైవేటు వాహనాలు సైతం పరిమిత సంఖ్యలోనే తిరుగుతున్నాయి. కోవిడ్‌–19 వ్యాప్తి కారణంగా ఇతరుల వాహనాల్లో వెళ్లే పరిస్థితి లేదు. మొత్తంగా వారికి విధులకు హాజరు కావడం ‘కత్తిమీద సాము’లాగా మారనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement