
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెసార్టెంట్‌లో ఎలుక ఎనిమిదేళ్ల బాలుడిని కొరికి గాయపరిచింది. ఈ దారుణం కొంపల్లిలోని ఎస్పీజీ హోటల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోఉన్న మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌లో మార్చి 8న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ప్రకారం.. రెస్టారెంట్‌లోని డైనింగ్ ఏరియా పక్కన ఉన్న వాష్‌రూమ్‌లో నుంచి ఒక పెద్ద ఎలుక ఒక్కసారిగా బయటకు పరుగెత్తుకొచ్చింది. అదే సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి కూర్చొని ఫుడ్ తింటున్నాడు. ఇంతలో ఎలుక బాలుడి పైకి ఎక్కి అతపి నిక్కర్‌లోకి చొరబడింది. భయంతో చిన్నారి కేకలు వేయగా.. అప్రమత్తమైన తండ్రి వెంటనే కొడుకు నిక్కర్‌లో నుంచి ఎలుకను బయటకు విసిరేశాడు.
అయితే అప్పటికే ఎలుక బాలుడి తొడపై పంటితో గాయపరిచింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని బోయిన్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడికి టెటానస్, యాంటీ రేబిస్ డోస్‌లు ఇచ్చామని.. అతని ఎడమకాలుపై రెండు చోట్ల కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి అయిన చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు.. రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటనపై స్పందించిన కంపెనీ
ఈ అంశంపై మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న అన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లలో నాణ్యత, సేవ, శుభ్రత ( quality,service,clean) విషయంలో కంపెనీ రాజీపడదు, ఎలప్పుడూ హైస్టాండర్డ్‌లోనే నిర్వహిస్తుంటుంది. అయితే హైదరాబాద్‌లోని జరిగిన ఘటన గురించి తెలిసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాము. మరో సారి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మా సిబ్బంది ఎల్లప్పుడూ రెస్టారెంట్ల నాణ్యత, శుభ్రత విషయంలో అత్యధిక స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తారని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆడిట్‌లోనూ బహిర్గతమైంది. మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ల భద్రత, శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. తాము ఎలప్పుడూ సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు.
RODENT ATTACK ON A CHILD in the McDonald’s restaurent Ground Floor, SPG Hotel, Kompally, Hyderabad, Telangana 500096.@McDonalds @mcdonaldsindia @consumercourtin @PiyushGoyalOffc @director_food @AFCGHMC @fooddeptgoi @TOIIndiaNews @TOIHyderabad @ABPNews @ndtv @ChildWelfareGov pic.twitter.com/wrjeQgAiBh
— Savio H (@SHenrixs) March 10, 2023