84 పోస్టులు.. 11,133 మంది పోటీ  | Singareni Coal Mining Company Received Huge Applications For Staff Nurse Posts | Sakshi
Sakshi News home page

84 పోస్టులు.. 11,133 మంది పోటీ 

Published Tue, Aug 24 2021 4:33 AM | Last Updated on Tue, Aug 24 2021 4:33 AM

Singareni Coal Mining Company Received Huge Applications For Staff Nurse Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సింగరేణి బొగ్గు గనుల సంస్థ పరిధిలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు భారీ దరఖాస్తులు వచ్చాయి. 84 పోస్టులకు గాను 13,379 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం 2,246 దరఖాస్తులను అధికారులు పక్కనపెట్టారు. దీంతో 11,133 మంది పోటీలో మిగిలారు. అంటే సగటున ఒక్కో పోస్టుకు 132 మంది పోటీపడుతున్నారు. ఈ నెల 29వ తేదీన కొత్తగూడెం, పాల్వంచలోని 18 కేంద్రాల్లో రాతపరీక్ష జరగనుంది. ఈ పోస్టులకు 10,415 మంది మహిళా అభ్యర్థులతో పాటు తొలిసారిగా 718 మంది పురుషులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. వాస్తవానికి స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు పోటీ పడేందుకు పురుష అభ్యర్థులకు తొలుత అనుమతి ఇవ్వలేదు.

అయితే వారు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో పురుష అభ్యర్థులు కూడా పరీక్ష రాసేందుకు సింగరేణి యాజమాన్యం అనుమతినిచ్చింది. అభ్యర్థులెవరూ అక్రమాలకు పాల్పడకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి క్షుణ్నంగా తనిఖీలు చేయనున్నట్టు ప్రకటించింది. పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకొస్తే.. డిబార్‌ చేసి కేసులు పెడతామని, భవిష్యత్‌లో సింగరేణి పరీక్షలకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించింది. 

సిబ్బందిని రహస్య ప్రదేశంలో ఉంచుతాం: డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ 
రాతపరీక్ష నిర్వహణలో పాలుపంచుకునే సిబ్బందిని కొద్దిరోజుల ముందు నుంచీ నిఘా పర్యవేక్షణలో సెల్‌ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్‌కు దూరంగా రహస్య ప్రదేశంలో ఉంచుతామని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. పరీక్ష పూర్తయ్యాకే వారిని బయటకు పంపిస్తారని వెల్లడించారు. రాతపరీక్ష ప్రశ్నలను కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ర్యాండమ్‌గా ఎంపిక చేయడం జరుగుతుందని, ఏ ప్రశ్న వస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. పరీక్షకు కొద్దిగంటల ముందే ప్రశ్నపత్రం తయారీ, ప్రింటింగ్‌ జరుగుతుందని.. ఎక్కడా లీకేజీకి అవకాశం ఉండదని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ప్రతిభను నమ్ముకొని పరీక్ష రాయాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో డైరెక్టర్లు, జీఎంలు, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేస్తారని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement