సాక్షి, ఆదిలాబాద్: చిన్నప్పటి నుంచీ పాటే ప్రాణంగా పెరిగాడు. ఎంతో కష్టపడి సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. దేశభక్తి పాటతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కరోనా బారిన పడడంతో రూ.11లక్షలకు పైగా వైద్యం కోసం ఖర్చు చేశాడు. ఆర్థిక పరిస్థితి ఛిన్నాబిన్నం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. మందమర్రి మూడో జోన్‌కు చెందిన నేరడికొమ్మ శ్రీనివాస్ ఉరఫ్ జై శ్రీనివాస్ స్థానిక సింగరేణి హైస్కూల్‌లో 1993లో పదో తరగతి వరకు చదివాడు. ఆయన తండ్రి మందమర్రి ఏరియాలోని స్టోర్‌లో క్లర్క్‌గా విధులు నిర్వర్తించి 15ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు.
అక్క చైతన్య, బావ జితేంద్ర సహకారంతో హైదరాబాద్‌కు వెళ్లాడు. చిన్నప్పటి నుంచి పాటల మీద ఉన్న మక్కువతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అవకాశాలు లభించడంతో పలు చిత్రాల్లో పాడాడు. జై సినిమాలోని దేశభక్తి పాట ‘దేశం మనదే తేజం మనదే..’, రాజారాణి సినిమాలో ‘ఓ బేబి ఓరకనులతో..’, వీధి సినిమాలో ‘నా చిట్టితల్లి..’, బోనాల పాట ఢమ ఢమ డప్పుల మోత, తెలంగాణ జననీ తదితర అనే పాటలతో గుర్తింపు పొందాడు. నేరడికొమ్మ శ్రీనివాస్ తన పాటతో ‘జై శ్రీనివాస్’గా మారాడు. సినిమా, దేశభక్తి, జానపద, దైవభక్తి పాటలు పాడి పేరు సంపాదించుకున్నాడు.
కరోనాతో ఆసుపత్రిలో..
జై శ్రీనివాస్ గత నెలలో కరోనా బారిన పడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటివరకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.11లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉండడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో భార్యాపిల్లలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవత్వంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీనివాస్ తండ్రి రామాచారి బ్యాంకు అకౌంట్ నంబరు 62107990766, ఐఎఫ్‌సీ కోడ్ N0020308, గూగుల్‌పే నంబర్ 918247641235కు దాతలు ఆర్థికసాయం అందించాలని భార్య స్వాతి, కూతుళ్లు అభిష్ణు, జైత్ర కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment