సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని చింతల్‌ఠాణా పునరావాస కాలనీకి చెందిన సామంతుల వసంత, స్వామి కూతురు శిరీష (హారిక) పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లారు. వైద్యులకు చూపించారు. వారు ‘ఎలాంటి ఇబ్బంది లేదు.. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం’అనడంతో.. సాధారణ కాన్పుకు సిద్ధమయ్యారు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు, సేవలపై వసంత సంతృప్తి చెందింది. దీంతో చదువు రాని ఆమె వెంటనే తన కూతురు శిరీషతో రాయించిన ఉత్తరం మంత్రి హరీశ్‌రావుకు మంగళవారం చేరింది.
ఉత్తరం ఇలా..
‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులున్నాయని నా బిడ్డను సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేశాడు. బాగా నొప్పులతో ఆసుపత్రికెళ్లినం. అక్కడ డాక్టర్‌లు మంచిగా చూసి ‘సాధారణ కాన్పు చేపించుకో’అన్నారు. పైసా ఖర్చులేదు, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, అమ్మఒడి వాహనంలో మా ఇంట్లో దింపిండ్రు..
కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా. సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ఉన్నాయ్.. కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికే రావాలి.. నాకు జరిగిన మేలు అందరికి జరగాలే.. ఇట్లు.. శామంతుల వసంత’అని లేఖలో పేర్కొన్నారు.
చాలా సంతోషంగా ఉంది
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకొని.. సాధారణ కాన్పులు చేపించుకోవాలని, తన బిడ్డకు జరిగిన మేలు అందరికీ జరగాలని ఒక మంచి సందేశం ఇచ్చిన వసంత ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లపాపలతో వర్ధిల్లాలి. ఈ ఉత్తరం ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగిస్తుంది.
– మంత్రి హరీశ్‌రావు
సారుకు చేరుతుందని అనుకోలే..
మా బిడ్డ చిన్న వయసుది. కోనరావుపేట మల్కపేటకు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేసినం. తొలిచూరు కాన్పు తల్లిగారే చేయాలి కాబట్టి సిరిసిల్ల దవాఖానాకు తీసుకపోయిన. నార్మల్ డెలివరీ అయింది. మాకు జరిగిన మేలు పది మందికి తెలువాలే అని సారుకు మా బిడ్డ శిరీషతో ఉత్తరం రాయించిన. అది సారుకు చేరుతుందని అనుకోలే. ప్రైవేటు దావాఖానాకు పోతే ఎంత లేదన్నా రూ.40వేలు అయ్యేది. మా ఉత్తరానికి మంత్రి స్పందించడం సంతోషంగా ఉంది.
– వసంత, చింతలఠాణా ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment