సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల మొదటివారంలో ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఊరూరా ఇల్లిల్లూ తిరిగి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం సేకరించి హెల్త్ ప్రొఫైల్‌ను పక్కాగా రూపొందించాలని సూచించారు.
సోమవారం ఇక్కడ జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఈ పరీక్షలు పూర్తయినవారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజ్ చేస్తారని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఆసుపత్రికి వెళ్లినా, యాక్సిడెంట్‌కు గురైనా అతడి ఆరోగ్య సమాచారమంతా క్లౌడ్ స్టోరేజ్ నుంచి తెప్పించుకుని వైద్యసేవలు అందిస్తారని అన్నారు. హెల్త్ ప్రొఫైల్ సమాచారం పకడ్బందీగా ఉంటే, ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుందన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి... ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్యసేవలు, మందులు అవసరం... ఎలాంటి వైద్య నిపుణులు, వైద్య పరికరాలు అవసరం... అనేవి తెలుస్తాయని వివరించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం 8 పరీక్షలు చేస్తుండగా, తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా 57 టెస్టులు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇందులో వాడే పరికరాల ద్వారా ఫలితాలు కచ్చితంగా ఉంటాయని, రోజుకు పదివేల పరీక్షలు చేయొచ్చని పేర్కొన్నారు.
నోడల్ ఆఫీసర్ల ద్వారా వేగంగా..
ప్రతి ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య సమాచారం తీసుకోవాలని, నోడల్ ఆఫీసర్లను నియమించి ఈ ప్రక్రియ వేగంగా సాగేలా చూడాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్‌ను ఎలా తయారు చేయనున్నారనే వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు.
ఈ సమాచారం ద్వారా వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అంచనా వేసి, హైరిస్క్ వాళ్లకు అవసరమైవ వైద్యసేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్‌లతో కూడిన కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment