SLBC టన్నెల్‌ ప్రమాదం.. రంగంలోకి ప్రత్యేక కెమెరాలు | SLBC Tunnel Accident On February 25th Updates In Telugu, More Details Inside | Sakshi
Sakshi News home page

SLBC టన్నెల్‌ వద్దకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Published Tue, Feb 25 2025 7:07 AM | Last Updated on Tue, Feb 25 2025 1:03 PM

SLBC Tunnel Accident February 25th Updates

సాక్షి,నాగర్‌కర్నూల్‌:శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ ప్రమాదంలో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌ నుంచి మంగళవారం(ఫిబ్రవరి 25) బయలుదేరారు. కాసేపట్లో ఆయన టన్నెల్‌ వద్దకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా టన్నెల్‌ వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. 

టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. 

 సొరంగంలో చిక్కుకుపోయిన  ఎనిమిది మంది ఆచూకీ కోసం అత్యాధునిక ఎండోమోడ్‌ కెమెరాలను లోపలికి పంపారు. 9 వేర్వేరు బృందాలుగా 600 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 72 గంటలు గడిచినా ఎనిమిది మంది ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఒక్కసారిగా కూలిపడటంతో.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట (ఇన్‌లెట్‌) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వకం పూర్తయింది. 



అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8.30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. నాలుగో ప్రయత్నంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటికి వచ్చింది. 

ఐదో ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోలి్చతే సోమవారం నాటికి మట్టి, శిథిలాల ఎత్తు, పరిమాణం గణనీయంగా పెరిగాయి. దీనితో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. సొరంగం లోపల 200–250 మీటర్ల మేర 15–20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు చెబుతున్నారు. 

72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ



నేడు మరో ప్రత్యేక బృందం 
ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది మొత్తం కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్‌ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. 



పైనుంచి రంధ్రం చేయడానికి జీఐఎస్‌ నో 
ఎల్‌ఎస్‌బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని ఐదో రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్‌ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి, శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి.  

సొరంగంలోకి రాకపోకలకే 4 గంటలు.. 
గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. తొలుత కేవలం లోపలి పరిస్థితిని దూరం నుంచి మాత్రమే అంచనా వేయగలిగామని.. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్‌ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని వెల్లడించారు. 

నిరంతరం కొనసాగుతున్న నీటి ఊట 
సొరంగంలో నీరు నిరంతరం ఊరుతూ, కూలిన ప్రాంతాన్ని నింపేస్తోంది. ఇన్‌లెట్‌ నుంచి లోపలికి వెళ్లే నీరు గ్రా>విటీ ద్వారా అవుట్‌లెట్‌ వైపు వెళ్లేలా సొరంగాన్ని వాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తవి్వన మేరకు సొరంగం కూలిన ప్రాంతమే చివరిది కావడంతో.. ఊట నీళ్లు అక్కడే పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీనితో నిరంతరంగా ఆ నీటిని బయటికి పంపింగ్‌ చేస్తున్నారు. 

కార్మీకుల కుటుంబాల్లో ఆందోళన.. నేడు సర్కారు కీలక ప్రకటన? 
ప్రమాదం జరిగి సోమవారం అర్ధరాత్రి సమయానికి సుమారు 65 గంటలు దాటింది. కానీ సొరంగంలో గల్లంతైనవారి జాడ తెలియరాలేదు.  దీనితో కార్మీకుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. సోమవారం ఇద్దరు కార్మీకుల కుటుంబ సభ్యులు సొరంగం వద్ద చేరుకుని.. తమవారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కార్మీకుల యోగక్షేమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

సొరంగం లోపలికి డ్రోన్, మినీ జేసీబీ.. 
నీళ్ల కింద ఉన్న వస్తువులను గుర్తించే సోనార్‌ టెక్నాలజీ ఆధారంగా కార్మీకుల జాడను తెలుసుకునేందుకు ఆదివారం ప్రయతి్నంచగా.. ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. నీటిలో మనుషుల రక్తం, అవశేషాలను గుర్తించే పోలీసు జాగిలాలు (స్నిఫర్‌ డాగ్స్‌)ను సొరంగంలోకి తీసుకెళ్లినా.. ప్రమాద స్థలంలో నీరు, బురద ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయాయి. చివరిగా ఐదో రెస్క్యూ బృందంతో ఒక అత్యధునిక డ్రోన్, ఇద్దరు ఆపరేటర్లను సొరంగం లోపలికి పంపించారు.  

రెస్క్యూ బృందాలు వెళ్లలేని చోట్ల దీనితో జరిపే పరిశీలన ఆధారంగా లోపలి పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సొరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడానికి సోమవారం లోకో ట్రైన్‌ సాయంతో మినీ జేసీబీని లోపలికి పంపించారు. దీనితో మట్టి, శిథిలాల తొలగింపు చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న కన్వేయర్‌ బెల్ట్‌కి సైతం మరమ్మతులు ప్రారంభించారు. మట్టి, శిథిలాలను కన్వెయర్‌ బెల్ట్‌ ద్వారా బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సహాయక చర్యల్లో ఉన్నతాధికారుల బృందం 
రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ నేతృత్వంలో టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్, నాగర్‌కర్నూల్‌ జిల్లా మాజీ కలెక్టర్‌ ఇ.శ్రీధర్‌లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం మూడు రోజులుగా సొరంగం వద్ద మకాం వేసి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలతో నిరంతరం సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. 

సొరంగంలోకి ‘ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌’ 
సొరంగంలో సహాయక చర్యల్లో మరో ప్రయత్నంగా మరో రెస్క్యూ బృందం ‘ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌’తో కలసి లోపలికి వెళ్లింది. ఉత్తరాఖండ్‌లోని సిలి్కయార సొరంగం 2023 నవంబర్‌లో కుప్పకూలింది. దానిలో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం బయటికి తీసుకురాగలిగింది. దీంతో ఎస్‌ఎల్‌బీసీ వద్ద సహాయక చర్యల కోసం ‘ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌’ను ప్రభుత్వం రప్పించింది. 

ఈ బృందం సొరంగంలో, పేరుకుపోయిన మట్టిలో ఎలుక బొరియల తరహాలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి కార్మీకులను బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే సొరంగం రెండో వైపు పూర్తిగా మూతబడి ఉండటం, పెద్ద మొత్తంలో ఊట నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఉండటంతో ‘ర్యాట్‌ హోల్‌’ విధానంలో రెస్క్యూ ఆపరేషన్‌ శ్రేయస్కరం కాదనే భావన వ్యక్తమవుతోంది. 

అయితే ర్యాట్‌ హోల్‌ మైనర్లు సొరంగంలో ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వారు సొరంగం నుంచి బయటికి వస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. ఇక మంగళవారం ఉదయానికల్లా మరో ‘ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌’ బృందం టన్నెల్‌ వద్దకు చేరుకోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement