సాక్షి సిటీబ్యూరో: లాక్‌డౌన్ కరోనా ప్రభావంతో గత కొన్ని నెలలుగా ఫుట్‌పాత్ వ్యాపారులు పాటు ఇతర చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయారు. లాక్‌డౌన్ తొలగింపుతో ప్రస్తుతం ఫుట్‌పాత్, చిరు వ్యాపారాలు కాస్త పుంజుకుంటున్నాయి. నాలుగు నెలల పాటు వ్యాపారాలు లేక ఆదాయం కోల్పోయిన వ్యాపారులు తమ చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బును కుటుంబ పోషణకు ఖర్చు చేసేశారు. ఇప్పుడు తిరిగి వ్యాపారం చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల (పైవేట్ ఫైనాన్సర్స్)ను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ వడ్డీ అయినా సరే విధి లేని పరిస్థితిలో అప్పు తీసుకుంటున్నారు.
లక్షకు రూ.10 వేలు మినహాయించుకొని...
పాతబస్తీ నయాపూల్‌కు చెందిన నజీర్ అనే ఓ వ్యాపారి లాక్‌డౌన్, కరోనా కారణంగా నాలుగు నెలలుగా వ్యాపారం లేక ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఇప్పుడు తిరిగి చెప్పుల వ్యాపారం చేయడానికి పెట్టుబడి కోసం ఫైనాన్సర్‌ను సంప్రదించగా.. పరిచయం ఉన్న వ్యక్తితో ష్యూరిటీ ఇప్పించాలని చెప్పాడు. ‘రూ.లక్ష అప్పు ఇస్తా.. వాటిలో పది వేలు ముందే తగ్గించుకుంటా.. ప్రతి రోజూ వెయ్యి తిరిగి చెల్లించాలి’ అని షరతు పెట్టాడు. విధిలేని పరిస్థితిలో నజీర్ దీనికి ఒప్పుకొని డబ్బు తీసుకున్నాడు.
3 నెలలకోసారి వడ్డీ రేటు మార్పు...
సుల్తాన్ బజార్‌కు చెందిన హన్మంతు అనే ఓ చిరువ్యాపారి చేతిలో ఉన్న డబ్బంతా లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యాపారం లేక ఇంటి పోషణకు ఖర్చయి పోయింది. ప్రస్తుతం మార్కెట్ కాస్త పుంజుకోవడంతో మళ్లీ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా డు. చేతిలోడబ్బులు లేకపోవడంతో వడ్డీ వ్యాపారిని కలిశాడు. రూ. 2 లక్షల అప్పు కావాలంటే.. రూ. 4 లక్షల విలువైన ఆస్తి ష్యూరిటీగా పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలన్నాడు. అలాగే ఖాళీ పేపర్‌పై సంతకాలు చేయడంతో పాటు ఖాళీ చెక్కులు ఇవ్వాలన్నాడు. ఇక మొదట 3 నెలలకూ నూటికి రూ. 2లు వడ్డీ ఉంటుందని, ఆ తర్వాత మూడు నెలలకు రూ. 4లు, ఆ తర్వాత 3 నెలలకు రూ. 8, ఏడాదికి రూ. 16 వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని షరతు పెట్టాడు. గత్యంతరం లేక హన్మంతు డబ్బులు తీసుకున్నాడు.
పేదరికం, అత్యవసరాన్ని ఆసరా చేసుకొని..
చిరువ్యాపారుల పేదరికం, అత్యవసరాన్ని వడ్డీ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. చోటా మోటా నేతల అండదండలతో పేదలను దోచుకుంటున్నారు. రూ.10 నుంచి రూ. 50 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ చెల్లించడం అలస్యమైతే చక్రవడ్డీ, బారువడ్డీ అంటూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. దీంతో చిరువ్యాపారులు అసలు తీర్చలేక ఆస్తులను, ఇళ్లను అమ్మి వడ్డీ చెల్లిస్తున్నారు. ఇంకొందరు వడ్డీ చెల్లించలేక చివరకు బలవన్మరణాలకు సైతం వెనుకాడటం లేదు.
ఇప్పుడే పుట్టుకొచ్చిన దందా కాదు...
ఈ దందా నగరంలో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు..గత 50 ఏళ్లుగా పాతబస్తీతో పాటు నగరంలో మార్వాడీలు భూమి, ఇళ్ల పత్రాలను పెట్టుకొని వడ్డీపై డబ్బులు ఇస్తున్నాయి. కానీ ఈ మధ్య వడ్డీ జలగల బరితెగింపు వికృత రూపం దాల్చింది. నగరం, ప్రత్యేకంగా పాతబస్తీలో తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయాలు, ఇడ్లీలు, బజ్జీలు అమ్ముకునే చిరు వ్యాపారులకు అప్పులిచ్చి వేధించుకొని తింటున్నారు. సాయంత్రానికి వడ్డీ ఇవ్వకుంటే బెదించడం, భౌతిక దాడులకు పాల్పడటం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న చిరువ్యాపారులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment