స్పామ్, పెస్కీ కాల్స్‌తో తప్పని చిక్కులు
రోజుకు సరాసరిన మూడు ప్రమోషన్ కాల్స్
మొబైల్ వినియోగదారులను విసిగిస్తున్న టెలీ ప్రమోషన్లు
88 శాతం మొబైల్ యూజర్లకు ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్‌ఎస్టేట్ కంపెనీల నుంచే కాల్స్
ఆరు నెలల్లో 96 శాతం పెరిగిన ఈ తరహా ప్రమోషన్ కాల్స్ జంజాటం
వెల్లడించిన లోకల్ సర్కిల్స్ సర్వే
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ వినియోగం అనేది నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఎక్కడున్నా ఇతరులతో మనం ఎప్పుడూ ‘హలో’దూరంలోనే ఉండొచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్లలో ఇప్పుడు సొల్లు ముచ్చట్లు ఎక్కువయ్యాయి. మనకు అవసరం లేని విషయాలు చెప్పి విసిగించే వారు ఎక్కువవుతున్నారు.
బిజినెస్ ప్రమోషన్లు, ఆర్థికపరమైన ఆఫర్లు, అంశాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరిట ప్రతి నిత్యం ఏదో ఒక అపరిచిత నంబర్ నుంచి మన మొబైల్ ఫోన్‌కు ఫోన్‌కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌లు రావడం పరిపాటిగా మారింది. మొబైల్ వినియోగదారుల చెవిలో మోతగా మారిన ఈ పెస్కీ (ఇబ్బందికరమైన) కాల్స్‌తో మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లోకస్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.
మొత్తం 18,173 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా వీరిలో 95 శాతం మంది ఈ తరహా ఫోన్‌కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. రోజుకు సరాసరిన 3 కాల్స్ పైనే వచి్చనట్టు సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది వెల్లడించారు. డీఎన్‌డీ (డు నాట్ డిస్ట్రబ్–అనవసర ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు రావొద్దు అని పెట్టుకునే ఆప్షన్) వాడుతున్న వారికి ఈ స్పామ్ కాల్స్ బెడద తప్పడం లేదు. మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారిన ఈ తరహా ఫోన్‌కాల్స్‌కు సంబంధించి మొబైల్ వినియోగదారులు లోకల్ సర్కిల్స్ సర్వేలో పంచుకున్న అంశాలు ఇలా..
గత ఆరు నెలల్లో మరింత పెరిగిన బెడద
ఇలాంటి అనవసర, వ్యాపార ప్రమోషన్లకు సంబంధించిన ఫోన్‌కాల్స్ బెడద మొబైల్ వినియోగదారులు గత ఆరు నెలల్లో మరింత పెరిగినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆరు నెలల కిందట 90 శాతం నుంచి 95 శాతానికి ఇది పెరిగినట్టు తెలిపింది. ఆరు నెలల కిందట రోజుకు పదికిపైగా స్పామ్‌కాల్స్ వచ్చే వారి సంఖ్య 3 శాతం ఉండగా.. ఇది ఆరు నెలల్లో 23 శాతానికి పెరిగినట్టు సర్వే పేర్కొంది. అయితే, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ స్పామ్‌కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ట్రాయ్ (టెలీకమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చర్యలకు ఉపక్రమించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment