ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
బుద్ధభవన్‌లోని బీ–బ్లాక్ కేంద్రంగా త్వరలో కార్యకలాపాలు మొదలు
ఓఆర్‌ఆర్ లోపలి వరకు పరిధితో ఏర్పాటు
స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తుల వేళ సత్వర స్పందన తదితర లక్ష్యాలతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్‌లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది.
ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉండనున్నారు. ఓఆర్‌ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిççప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు.
దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు..
జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది.
అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పీడీపీపీ కింద కేసులు!
జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది.
చెరువులను పూడ్చడమంటే ధ్వంసం చేసినట్లేననే ఉద్దేశంతో ఈ దిశగా యోచిస్తోంది. ఈ చట్టం కింద కేసు నమోదు వల్ల బాధ్యుల నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
హైడ్రా ఠాణా పరిధి ఇలా...
హైడ్రా విస్తరించి ఉన్న 2,053.44 చదరపు కిలోమీటర్లలో ఉండే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు, ప్రత్యేక పాలనా సంస్థలు
ప్రత్యేక పరిపాలనా వ్యవస్థలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐలాలతో సహా 61 పారిశ్రామిక ప్రాంతాలు
కార్పొరేషన్లు
జీహెచ్‌ఎంసీ, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్–జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్
మున్సిపాలిటీలు
పెద్ద అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం.
గ్రామ పంచాయతీలు
రామచంద్రాపురం, ఐలాపూర్, కర్ధనూర్, కిష్టారెడ్డిపేట్, ముత్తంగి, పోచారం, సుల్తాన్‌పూర్, కాచివానిశింగారం, కొర్రెముల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట్, చేర్యాల్, గుడుమకుంట, కీసర, రాంపల్లి, తిమ్మాయిపల్లి, యాద్గిర్‌పల్లి, మన్ఖల్, గౌడవెల్లి, పుద్దూర్, మంచిరేవుల, బొమ్మరాస్‌పేట్, గోల్కొండ కలాన్, గోల్కొండ కుర్థ్, హమీదుల్లానగర్, జన్వాడ.
Comments
Please login to add a commentAdd a comment