సాధారణ రోజుల్లో కనీసం టీ దొరకని మారుమూల ఊళ్లలో ఇప్పుడు పదుల సంఖ్యలో హోటళ్లు, దుకాణాలు వెలుస్తున్నాయి. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలు నేడు ఇసుక రీచులతో ప్రత్యామ్నాయ ఉపాధి, ఆదాయం పొందుతున్నాయి. సాధారణంగా వ్యవసాయభూమి ఎకరం కౌలు రూ. 8–9 వేలు ఉంటే ప్రస్తుతం ఏడాదికి రూ.లక్ష వరకు భూ యజమానులకు లీజు చెల్లిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతాలైన కాళేశ్వరం, మహదేవపూర్ పరిధి గ్రామాల్లో కొత్తగా ఇసుక రీచులు ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ బతుకు చిత్రం మారుతోంది.
సాక్షి, భూపాళపల్లి : భూమికి నీటి వసతి ఉంటేనే ఎవరైనా కౌలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. అప్పుడు కూడా ఇచ్చేది ఎకరాకు పదివేలు మించదు. అయితే గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక రీచులు ఏర్పాటు చేస్తున్న చోట మాత్రం ఎకరా వ్యవసాయ భూమి లీజు ధర రూ.లక్ష వరకు ఉంటోంది. దీంతో వ్యవసాయం చేసినా ఇంత లాభం ఉండదని రైతులు ఆనందంగా తమ భూములను డంపింగ్ యార్డుల కోసం లీజుకిచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఇసుక రీచులు ఉన్న జిల్లాగా భూపాలపల్లికి పేరుంది.
ఇప్పటికే ఐదు రీచులు నడుస్తుండగా ప్రస్తుతం జిల్లాలో కొత్తగా మరో 10 ఇసుక రీచులు ఏర్పాటు చేసి 73 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను తీయనున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం పరిసరాల్లోని పలుగుల, మద్దులపల్లి, కుంట్లం, పూస్కుపల్లి, కుదురుపల్లిలో వ్యవసాయ భూముల లీజు ధరలకు రెక్కలొచ్చాయి. గోదావరి నుంచి తీసిన ఇసుకను స్టాక్ చేయడానికి సాగు భూములను ఉపయోగిస్తుండటంతో ఇంతటి విలువ వచ్చింది. ఇలా ఒక్కో రీచ్‌కు సుమారు 50– 60 ఎకరాల చొప్పున 600 నుంచి 700 ఎకరాల భూమిని ఇసుక రీచుల నిర్వాహకులకు రైతులు అప్పగించారు.
సొంతూళ్లలో ఉపాధి
ఇసుక రీచులతో గ్రామాల్లోని ప్రజలకు స్థానికంగా ఉపాధి దొరుకుతోంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. ఇసుక రీచులు ప్రారంభం కావడంతో ఇక్కడే ఉపాధి వెతుక్కుంటున్నారు. నలభై మందితో బ్యాచ్‌లుగా ఏర్పడి లారీలకు టార్పాలిన్లు కప్పడం, లారీలోని ఇసుకను చదును చేయడం, రీచ్‌ల్లో ర్యాంప్‌లను సిద్ధం చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ పనులతో పాటు లారీలకు డ్రైవర్లు, క్లీనర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తున్నారు. మరికొంతమంది హోటళ్లు, కిరాణా షాపులు పెట్టుకుని స్వయంఉపాధి పొందుతున్నారు. ఇసుక రీచులతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి జనం రాకపోకలు పెరగడంతో వీరికి గిరాకీ ఉంటోంది.
పదెకరాలు లీజుకిచ్చాను
క్వారీలు ఏర్పాటు కావడంతో పంట నష్టాన్ని కూడా కలిపి ఎకరాకు రూ.లక్ష చొప్పున 10 ఎకరాలు లీజుకు ఇచ్చాను. వ్యవసాయం చేసినా కూడా ఇంత లాభాలు రావు. నాతో పాటు చాలామంది రైతులు తమ భూములను ఇసుక డంపింగ్ కోసం ఇచ్చారు.
– మచ్చ లచ్చన్న, రైతు, పలుగుల, మహదేవపూర్
గిరాకీ మంచిగ ఉంటోంది
కిరాణా షాపు, హోటల్ బిజినెస్‌కు మంచిగానే గిరాకీ ఉంది. లారీ డ్రైవర్లతో పాటు క్వారీల సిబ్బందికి భోజనం పార్సిళ్లు ఆర్డర్లు వస్తున్నాయి. రోజుకు రూ.2 వేల దాకా గిరాకీ అవుతోంది.
– రాగం మధుకర్, హోటల్ నిర్వాహకుడు, పలుగుల గ్రామం
Comments
Please login to add a commentAdd a comment