
సాక్షి, హైదరాబాద్ : నెలలు నిండని శిశువులు భారత్‌లోనే ఎక్కువగా పుడుతున్నారు. ప్రపంచంలో మన దేశంలోనే ఆ సంఖ్య ఎక్కువుండటం ఆందోళన కలిగిస్తోంది. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్ని వివిధ అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడుకోవడం సవాల్‌గా మారింది. గర్భిణుల్లో ఇన్‌ఫెక్షన్, ఇతరత్రా అనారోగ్య సమస్యల వల్ల శిశువులు నెలలు నిండకుండా పుడతారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది పిల్లలు ఇలా నెలలు నిండకుండా పుడుతున్నారు.
అందులో 35 లక్షల మంది భారత్‌లోనే పుడుతున్నారు. ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు, భారత్‌లో ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఇలా పుడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో 60% మంది దక్షిణాసియా, ఆఫ్రికాలోనే నెలలు నిండకుండా పుడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నేడు (నవంబర్ 17, మంగళవారం) వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే. నెలలు నిండని పిల్లలు పుట్టకుండా, పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నదే ‘ఈ రోజు’ ముఖ్యోద్దేశం.
37 వారాల కంటే ముందే పుట్టడం
సాధారణంగా గర్భధారణ సమయం 40 వారాలు. సరిగ్గా నెలలు పూర్తయి పుడితే సహజంగా అనారోగ్య సమస్యలుండవు. 37 వారాల కంటే ముందు పుడితే వారిని నెలలు నిండని శిశువు అంటారు. అలాంటి వారిలో అనారోగ్య సమస్యలుంటాయి. గర్భిణీకి ఇన్‌ఫెక్షన్ రావడం, కవలలు ఉండటం వల్ల గర్భాశయం ఇరుకుగా మారడం, అలాగే ముఖద్వారం వదులుగా ఉండటం వంటి కారణాలతో నెలలు నిండకుండా శిశువులు పుడతారు. గర్భిణుల్లో ప్రత్యేక కారణాల వల్ల బీపీ పెరగడం, కాలేయంలో సమస్యలు ఏర్పడటం వల్ల కూడా నెలలు నిండకుండానే ప్రసవమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
కవల పిల్లల్లో 60 – 70 శాతం మంది నెలలు నిండని వారేనని వైద్య నిపుణులు అంటున్నారు. నెలలు నిండకుండా పుట్టేవారు కిలో కంటే తక్కువ బరువుంటే అతి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటాయి. 20 ఏళ్ల క్రితం దేశంలో కిలో కంటే తక్కువ బరువున్న నెలలు నిండని పిల్లల్లో 40 శాతం మాత్రమే బతికేవారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య వసతుల వల్ల అది 60 నుంచి 70 శాతానికి పెరిగింది. ఎయిమ్స్ వంటిచోట 65 శాతం, అంతర్జాతీయ ప్రమాణాలున్న ఆసుపత్రుల్లో 80 శాతం మంది బతుకుతున్నారు. అలాగే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)ను కేంద్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాలో ఏర్పాటుచేసింది. దీంతో నెలలు నిండనివారిని కాపాడుకోవడం సాధ్యమవుతోంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
►శిశువు కిలో కంటే తక్కువ బరువున్నట్టు భావిస్తే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
►పుట్టగానే డెలివరీ రూమ్‌లోనే వారికి అవసరమైన సంరక్షణ చేయాలి. నెలలు నిండని శిశువులు చలికి తట్టుకోలేరు. కాబట్టి వార్మర్ పెట్టాలి. ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ శరీరానికి చుట్టాలి.
►అవసరం మేరకు ఆక్సిజన్ వాడాలి. శ్వాసపరమైన ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా సరఫరా చేయాలి. దీంతో వెంటిలేటర్‌పైకి వెళ్లకుండా ఆపొచ్చు.
►నెలలు నిండని శిశువుల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టడం ద్వారా కాపాడుకోవచ్చు.
►తల్లిపాలు దివ్యౌషధం. జీర్ణవ్యవస్థ, పరిణితి చెందడానికి ఇవి సాయపడతాయి.
►ఇన్‌ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. అవసరమైతేనే శిశువులను తాకాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
►ఒక బిడ్డ నుంచి ఇతర బిడ్డలకు ఇన్‌ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. అవసరమైతే యాంటీ బయోటిక్స్ వాడాలి.
►చిన్నపిల్లలను చూసే యూనిట్లలో ఇంటెన్సివ్ కేర్ అందించాలి. రణగొణ ధ్వనులు ఉండకూడదు. అనవసరంగా లైట్లు వేయకూడదు.
►క్లస్టర్ కేర్ ద్వారా బిడ్డను సంరక్షించాలి. కొన్ని రకాల మందులివ్వాలి.
తల్లికి పోషకాహారం ఇవ్వాలి
నెలలు నిండకుండా శిశువులు పుట్టడాన్ని ఆపే వీలుంది. అందుకోసం ముందునుంచీ తల్లికి సరైన పోషకాహారమివ్వాలి. రక్తహీనత లేకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాగానే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రతి నెలా పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉంటే కుట్లు వేయాలి. గతంలో నెలలు నిండని శిశువులను కని ఉంటే, మరోసారి అలా జరగకుండా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భాశయ నిర్మాణంలో సమస్యలుంటే ముందే చికిత్స చేయించుకోవాలి. గర్భంలో కవల పిల్లలున్నట్లు గుర్తిస్తే ప్రతి నెలా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల నెలలు నిండకుండానే శిశువులు పుట్టకుండా చాలా మేరకు ఆపొచ్చు.
– డాక్టర్ విజయానంద్, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు, రెయిన్‌బో ఆస్పత్రి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment