రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చెంత కొలువుదీరేందుకు పెద్ద సంఖ్యలో వర్ణచిత్రాలు సిద్ధమవుతున్నాయి. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉన్న ప్రాధాన్యతకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దేందుకు పలువురు చిత్రకారులు వర్ణాలద్దుతున్నారు. ఒకేసారి ఇన్ని చిత్రాలు రూపుదిద్దుకోవడం, పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి అని నగర చిత్రకారులు చెబుతున్నారు.
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: వేల ఏళ్ల క్రితం నాటి రామానుజుల సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సదాశయంతో నెలకొల్పుతున్న సమతామూర్తి కేంద్రంలో వందలాదిగా వర్ణచిత్రాలు కొలువుదీరనున్నాయి. వీటిని కనువిందుగా చిత్రించే పనిలో రోజుకు కనీసం 50 మంది చిత్రకారులు భాగం పంచుకుంటున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న జీవా గురుకులంలో దీని కోసం అతిపెద్ద ఆర్ట్ క్యాంప్ ఏర్పాటైంది. నేపథ్యానికి అనుగుణంగా చిత్రాలను గీసేందుకు నగరానికి చెందిన పలువురు చిత్రకారులు, ఆర్ట్ కాలేజీ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు.
సమాజంలో ఎన్నో రకాల మంచి మార్పులకు, సర్వ ప్రాణి కోటి సమానత్వానికి, ఆధ్యాత్మిక ఆలోచనల వ్యాప్తికి ఎనలేని కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన రామానుజాచార్యులు జీవితంలోని ముఖ్య ఘట్టాలే నేపథ్యంగా ఈ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. సందేశాత్మకంగా సాగే ఆయన జీవితాన్ని కళ్లకు కట్టేలా మొత్తంగా 350 చిత్రాలు ఈ ఆధ్యాత్మిక పరిసరాల్లో కొలువుదీరనున్నాయి. సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 40 స్తంభాలకు నలువైపులా వీటిని అమరుస్తారు. ఈ పెయింటింగ్స్ కొన్ని 3/3, కొన్ని 3/11 సైజులో తయారవుతున్నాయి.
సమతామూర్తి విగ్రహం చెంత ఏర్పాటు చేసేందుకు చిత్రకారులు వేస్తున్న చిత్రాలు
నెలాఖరు వరకూ క్యాంప్...
చిత్రకళా శిబిరం నెలాఖరు వరకూ కొనసాగనుందని ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న నగర చిత్రకారుడు మారేడు రాము చెప్పారు. తాను రామానుజాచార్యుల జీవిత ఘట్టం లోని ముఖ్యమైన ఉపదేశాల సన్నివేశాలను రామానుజాచార్యులు రుషులకు బోధిస్తున్న దృశ్యాలను చిత్రించామని తెలిపారు. ఈ తరహా అతిపెద్ద చిత్రకారుల శిబిరం తన జీవితంలో చూడలేదని, దీనిలో తాను సైతం భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదొక పెద్ద చిత్రకళా పండుగలా ఉందన్నారాయన. గిన్నీస్ రికార్డ్ సాధించదగ్గ భారీ ఆర్ట్ క్యాంప్‌గా దీనిని చెప్పొచ్చునన్నారు. రేపటితో క్యాంప్ పూర్తవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment