భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ... భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియ రాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు.
నాటి వారి స్ఫూర్తిని నేటికీ నిలుపుతూ వారు పంచిన సమతను మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనీ.. మానవులందరూ వారి బోధనలను తెలుసుకోవాలనీ... ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని.. మరో వెయ్యేళ్ళు రామానుజులవారిని మనమంతా గుర్తుంచుకోవాలని రామానుజ సహస్రాబ్ది సందర్భంగా వెలసినదే సమతా కేంద్రం. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజ సమతా కేంద్రం నిర్మాణ విశేషాలు.. రామానుజులవారి జీవిత విశేషాలు
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది. నేటినుంచి ‘రామానుజ సహస్రాబ్ది సమారోహం’ ప్రారంభం కానుంది. పన్నెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి, దేశప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైన పాలకవర్గం, మరోవైపు ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన అనేకమంది పీఠాధిపతులు.. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
విహంగ వీక్షణ
దివ్యవిమానశిఖరాలు.. ఎత్తైన గోపురాలు.. గొప్ప శిల్పకళాశోభితమైన మండపాలు... అనేక ప్రాచీన శిల్పశైలీసంపన్నమైన స్వాగతతోరణాలు.. రామానుజ ఆచార్యాభిషేకం చేసే లీలాజలనీరాజనం (వాటర్ ఫౌంటెన్)... పచ్చటి ఉద్యానవనాలు... సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు...ఆచార్య పురుషుని చేరుకునే ఉజ్జీవన సోపానమార్గం... ఆపై భద్రవేదిపై. పద్మాసనంపై ఆసీనులై ప్రసన్న మందస్మిత వదనంతో దర్శనమిచ్చే భగవద్రామానుజులవారి దివ్య విగ్రహం దర్శించినవారి మనస్సు ఆనందంతో ఉప్పొంగక మానదు.
ప్రవేశద్వారం
ఉన్నతమైన రామానుజులవారి విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు ముందుగా ప్రవేశద్వారం వద్ద ఉన్న శిల్పకళను చూసి అచ్చెరువొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రవేశద్వారం నుండి నిష్క్రమణ ద్వారం వరకు ఉన్న శిల్పకళను పరిశీలనగా చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. వాటి విశేషాలను తెలుసుకోవడానికి ఒకరోజు చాలదు. ఇందులో భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవమంతా కొలువుతీరింది.
ఒకవైపు ప్రవేశద్వారం.. మరోవైపు నిష్క్రమణద్వారం.. వీటి మధ్యలో ఉన్న అనేక మండపాలు.. స్వాగతతోరణాలు.. మొదలైనవాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయనగరనిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యం.. వైష్ణవసంప్రదాయంలో భక్తికి ప్రతీకలుగా నిలిచిన గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తైన మండపాల్లో కొలువుతీరాయి. హంసద్వారం.. యాళిద్వారం... వాటిపై కాకతీయ స్వాగతతోరణాలను నిర్మించిన తీరు ఈ నేలపై పరిఢవిల్లిన ఒకప్పటి సామ్రాజ్య వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. దక్షిణాది, ఉత్తరాది శిల్పౖ శెలులను గుర్తుకు తెచ్చే అనేక విమానశిఖరాలు.. ఆలయగోపురాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి ఆమూలాగ్రం ఈ వరుసను పరికిస్తే భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం కళ్లముందు నిలుస్తుంది.
భూమిపై ధర్మానికి ఆపద కలిగినప్పుడు దుష్టశిక్షణ.. శిష్టరక్షణకు చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రానక్షత్రంలో రామానుజాచార్యుడు జన్మించాడు. ఆయన తండ్రిపేరు ఆసూరి కేశవ సోమయాజి, తల్లిపేరు కాంతిమతి.
సమతామార్గం
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షం పొందడానికి అర్హులే అని చాటి చెప్పిన మహనీయుడు శ్రీమద్రామానుజులు. అందుకే ఆయన దేవుని దరిచేర్చే అష్టాక్షరీమహామంత్రాన్ని అందరికీ వినిపించేలా చెప్పారు. అందరూ సమానమేనని చాటారు. ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు.
ఆచార్యుల ఆశయ వారసుడు
వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ముఖ్యమైనవారుగా పరిగణింపబడుతున్నారు. వీరిలాగే అనేకమంది గురువులు విష్ణుభక్తిని సమాజంలో నెలకొల్పడానికి పాటుపడ్డారు. ఆ కోవలో యామునాచార్యులు ముఖ్యమైన గురుస్థానాన్ని పొందారు. 1042 లో వారు పరమపదించారనే వార్త తెలుసుకొని, వారు వారి జీవితకాలం లో చేయాలనుకుని కలగన్న మూడు కోర్కెలను తీరుస్తానని రామానుజులవారు ప్రతినబూని వాటిని నెరవేర్చారు. యామునాచార్యులవారి వారసత్వాన్ని నిలబెట్టారు.
గురువుకే గురువు
శ్రీరామానుజాచార్యులవారు పదహారు సంవత్సరాల వరకు శ్రీపెరంబుదూరులోను, ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు తిరుప్పుట్‌కుళిలోను, పదేళ్లపాటు కంచిలోను వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
యాదవప్రకాశులనే వేదాంతగురువు పాఠం చెప్తూ విష్ణునేత్రాలను వర్ణిస్తూ వాటికి వింత పోలికలను పోలుస్తూ విచిత్ర ఉపమానాలిస్తున్నప్పుడు రామానుజులవారు అది తప్పని చెబుతూ ‘సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి’ అనే శంకరుల భాష్యాన్ని ఉదహరిస్తూ సరైన అర్థాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో.
అంతా బ్రహ్మమా? బ్రహ్మమే అంతానా?
సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యానికి జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే కాని, వేరుకాదు అని అంతవరకూ పండితులు చెప్పిన విశ్లేషణను వ్యతిరేకిస్తూ.. జగత్తులోని అంశలన్నీ భగవంతుని శరీరాలు. అన్నింటిలోనూ భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ అంశకు, భగవంతునికీ భేదంలేదని చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మ అనంతుడంటే సరిపోతుంది కాని, అనంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచిస్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాదు. సత్య, జ్ఞాన, అనంతాలు భగవంతుని సహజగుణాలు. అటువంటి పరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతంగాని పరిపూర్ణంగా
చిత్రించలేవు కదా! నలుగురి మంచికోసం నరకానికైనా...
కాంచీపురంలోనే పెరియనంబి నుండి దివ్యప్రబంధాన్ని, శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలను, వర రంగాచార్యుల నుండి వైష్ణవ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. ఈ మంత్ర రహస్యాన్ని విన్నవారంతా మోక్షం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని గ్రహించారు రామానుజులు. ప్రయాస లేకుండా ప్రజలందరికీ మోక్షం కలిగించాలని ఒకనాడు గుడిగోపురమెక్కి అందరూ వినేలా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అది విన్న గోష్ఠీపూర్ణులవారు. ‘అనర్హులకు ఈ మంత్ర రహస్యాన్ని వివరిస్తే పాపం పొంది నువ్వు నరకానికి పోతావు!’ అని చెప్తే ‘అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు నేనొక్కడినే నరకానికి వెళ్లినా పర్వాలేదు’ అని అన్నారు రామానుజులు. వారి గొప్ప మనస్సుకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో మెచ్చుకుని. ‘నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా!’ అని రామానుజలవారిని గౌరవించారు.
రామానుజుల రచనలు – విశిష్ఠ కృతులు
రామానుజులవారు శ్రీభాష్యమనే పేరుతో ప్రస్థానత్రయానికి భాష్యం రచించారు. వారు రచించిన శరణాగతి గద్యని ప్రతి నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. శరణాగతిగద్య, శ్రీరంగగద్య, శ్రీవైకుంఠగద్య అనే మూడింటినీ గద్యత్రయం అంటారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్ఠసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ద్రవిడవేదం పట్ల అందరూ గౌరవ, ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు. దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం (రెండుగా లేనిది). విశిష్టాద్వైతం అంటే ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటి గా ఉండవచ్చని తెలిపారు.
అర్చామూర్తిని కొలిచి అర్చామూర్తిగా నిలిచి..
ఎందరో మహాత్ములు తమ చరమాంకంలో భగవంతునిలో లీనమైపోయారు. మరికొందరు సజీవసమాధి పొందారు. ఇంకొందరు దివ్యవిమానంలో ఆకాశమార్గాన దివ్యలోకాలు పొందారు. మరికొందరు దేవతా విగ్రహాలలో లీనమైపోయారు. అయితే తమ జీవితపర్యంతమూ అర్చామూర్తుల అర్చనాది కైంకర్యాలను, ఆలయసేవలను ఏమాత్రం లోటు లేకుండా ఆలయాలలో జీయర్ వ్యవస్థను బలోపేతం చేసి, అర్చామూర్తి ఆరాధనతో అందరూ పరమపదం చేరవచ్చని చాటిన భగవత్ రామానుజులవారు 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు పరమపదించి తన దేహాన్నే విగ్రహంగా మలచుకున్నారు. దానికి సాక్ష్యంగా నేటికీ ఆ విగ్రహం ‘తానాన తిరుమేని’ గా శ్రీరంగంలోని వసంతమంటపంలో దర్శనమిస్తుంది.
లీలాజల నీరాజనం (డైనమిక్ ఫౌంటెయిన్) ప్రవేశద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఒక వాటర్ ఫౌంటెయిన్ కనిపిస్తుంది. ఇది ఒక విశేషమైన నిర్మాణం. దీని చుట్టూ అష్టదళాకృతిలో నీటిని చిమ్ముతూ రెండు వరుసలలో తొట్లు ఉన్నాయి. దానికి మధ్యలో కింద వరుసలో సింహాలు, వాటిపై ఏనుగులు, దానిపై హంసలు ఉంటాయి. వాటిపై అష్టదళపద్మం లోపల రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. సింహాలు తామసగుణానికి, ఏనుగులు రాజసగుణానికి, హంసలు సాత్విక గుణానికి ప్రతీకలుగా వాటిపై త్రిగుణాతీతుడైన భగవద్రామానుజులవారు పద్మాలు విచ్చుకుని నిర్ణీత సమయంలో సౌండ్ సిస్టమ్ ద్వారా నీరు పైకెగసి, మధ్యలో చుట్టూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. సంప్రదాయ వాద్యాలతో ఏర్పాటు చేసిన ధ్వనితో, నీటి నాట్యంతో జరిగే విన్యాసం చూసిన భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది.
ఉజ్జీవన సోపానాలు
లీలాజల నీరాజనం దాటి ముందుకు సాగితే భద్రవేదిపై కొలువుతీరిన రామానుజుల దర్శనం చేసుకోవాలని వెళ్లే భక్తులకు ఉజ్జీవనసోపాన మార్గం దర్శనమిస్తుంది. మొత్తం మెట్ల సంఖ్య 108. భగవంతుని దివ్య నామావళి 108ని ప్రతీకగా తీసుకుని ఈ మెట్ల సంఖ్య నిర్ణయించారు. అటూ ఇటూ ఎండవేడిమి, వానతాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా పైన మండపాలు మొత్తం 18 ఉన్నాయి. వీటిని సోపాన మండపాలు అంటారు.
భద్రవేది – బంగారు రామానుజులు
రామానుజుల విగ్రహం ఉన్న వేదిక ఈ భద్రవేది. ఇది మూడంతస్తుల నిర్మాణం. కింద భాగంలో ప్రవచనమండపం ఉంది. మొదటి అంతస్తులో బంగారు రామానుజులవారు కొలువుతీరే శరణాగత మండపం ఉంది. దీని చుట్టూ స్తంభాలపై 32్ర బహ్మవిద్యల విగ్రహాలున్నాయి. ఈ రామానుజమూర్తి నిర్మాణం కోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ బంగారు రామానుజుల వారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 13న ఆవిష్కరించనున్నారు. దానిపై అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఈ భద్రవేది పొడవు 54 అడుగులు.
చుట్టూ 108 దివ్యదేశాలు
భద్రవేది చుట్టూ భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 108 దివ్యదేశాలలో 92 క్షేత్రాలను పర్యటించి, ఆ ఆలయాలను పరిశీలించి అదేవిధంగా ఆలయం ఆకృతి, దేవతామూర్తులు ఉండేలా ఈ ఆలయాలను తీర్చిదిద్దారు. భూమిపై ఉన్న ఆలయాలు 106. 107 వది క్షీరసాగరం, 108వది పరమపదం. సర్వతోభద్ర మండలాకృతిలో ఉన్న ఈ ఆలయాల్లో మొదటి ఆలయం శ్రీరంగం కాగా చివరిది పరమపదం.
Comments
Please login to add a commentAdd a comment