TS Students Admissions Increasing In Telangana Public Schools - Sakshi
Sakshi News home page

చలో సర్కారు బడి.. అదే సమస్య మరి!

Published Sat, Oct 23 2021 2:12 AM | Last Updated on Sat, Oct 23 2021 11:15 AM

Student Admissions Increasing In Telangana Public Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలను వదిలిపెట్టి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. సర్కారు స్కూళ్లకు ఇప్పుడు అదే సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరగడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీనికితోడు విద్యా వాలంటీర్ల నియామకాలపై కూడా స్పష్టత లోపించడంతో బోధన ఇబ్బందికరంగా మారింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ పాఠశాలలను విడిచి కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు రెండున్నర లక్షల మందికిపైగా ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే కొన్నిచోట్ల పాఠశాల మొత్తానికీ ఒకే టీచర్‌! మరికొన్ని చోట్ల వంద మందికి పైగా విద్యార్థులున్నా ఇద్దరే టీచర్లు. అదికూడా హెచ్‌ఎంతో కలిపి. హెచ్‌ఎం పాఠాలు చెప్పాలా? పాఠశాల నిర్వహణ, ఇతరత్రా పనులు చూసుకోవాలా? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేక, చాలాచోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన కష్టతరంగా మారుతోంది. కనీసం 20 వేల మంది వరకు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి.  

బోధనకు బోలెడు కష్టాలు.. 
తెలంగాణ వ్యాప్తంగా 42,575 స్కూళ్లుంటే, అందులో 30 వేల వరకూ ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 28 లక్షల మందికిపైగా సర్కారీ స్కూళ్లలో చదువుతున్నారు. కరోనాతో చితికిపోయిన ఆర్థిక పరిస్థితులు, బడుగు జీవులు పట్నాలు వదిలి పల్లె వాకిటకు చేరడం, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయి. కానీ ఉపాధ్యాయుల కొరత మాత్రం అలాగే ఉంది.

ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 1.05 లక్షల మంది ఉపాధ్యాయులుండగా..ఇంకా కనీసం 20 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. టీచర్లు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో బోధన కుంటుపడుతోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పాఠశాలలను పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారులు కూడా లేరు. సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకే ఆ బాధ్యతలను అప్పగించారు. దీనితో వారు పాఠశాల నిర్వహణ, మండలంలోని ఇతర పాఠశాలల పర్యవేక్షణపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది.  

ఆగిన హేతుబద్ధీకరణ 
ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ హడావుడి చేసింది. టీచర్లు తక్కువగా ఉంటే వేరేచోట నుంచి సర్దుబాటు చేయడం, ఎక్కువగా ఉంటే ఇతర స్కూళ్లకు పంపడం, విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళ్లను విలీనం చేయడం వంటి కసరత్తు నిర్వహించాలని భావించింది. ఆ తర్వాతే టీచర్‌ పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం గురించి ఆలోచిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈ ప్రక్రియ ఆదిలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయ సంఘాలు మొదలు అన్ని వైపుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విమర్శలతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కరోనా నెమ్మదించి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన మొదలైంది.  

విద్యా వలంటీర్ల మాటేమిటి? 
విద్యా వలంటీర్లను సరిపడా తీసుకుంటే సమస్య తీవ్రత కొంత తగ్గుతుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కానీ హేతుబద్ధీకరణ జరగకుండా ముందుకెళ్లేది లేదని విద్యాశాఖ పట్టుబట్టింది. తాజాగా 5,823 తాత్కాలిక పోస్టులను మంజూరు చేసినా కస్తూరిబా బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకే చాలామందిని కేటాయిస్తారు. దీంతో ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత యథాతథంగానే ఉండే అవకాశం కన్పిస్తోంది.

2017 డీఎస్సీ ద్వారా 7 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినా ఇప్పటివరకు 2 వేల మందికి మాత్రమే నియామక ఉత్తర్వులిచ్చారు. పదవీ విరమణలతో ఖాళీ అయ్యే పోస్టులను మాత్రమే భర్తీ చేసుకుంటూ పోతుండగా కోర్టుల్లో కేసులు కూడా నియామకాలకు ఆటంకంగా మారాయని సమాచారం. ఏది ఏమైనా టీచర్ల కొరత తీర్చకపోతే క్రమంగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లవైపు మొగ్గుచూసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సాగుతోంది. ఇక్కడ  92 మంది విద్యార్థులున్నారు. వీళ్ళకు చదువు చెప్పేందుకు ఒకేఒక్క టీచర్‌.. అది కూడా హెచ్‌ఎం ఉన్నారు. ఆయన కూడా వేరే ప్రాంతం నుంచి డిప్యుటేషన్‌పైనే వచ్చారు. అంతమందికి బోధన ఎట్లా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లాలో 847 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 67,546 మంది చదువుతున్నారు. వీరికి  3,400 మంది టీచర్లు అవసరం. కానీ ఉన్నది 3,176 మంది మాత్రమే.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 94 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందులో ఇద్దరిని వేరే స్కూలుకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ స్కూల్‌లో ఇద్దరే ఉపాధ్యాయులున్నారు. కొత్తపాలెం యూపీఎస్‌లో 110  విద్యార్థులుంటే ఇద్దరు, గుంటుపల్లి గోపవరం యూపీఎస్‌లో 80 మంది విద్యార్థులకు ఒకే టీచర్‌ ఉన్నారు. 

హనుమకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్‌లో 1,120 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ హెచ్‌ఎం పోస్టు ఖాళీ. దీంతో సీనియర్‌ ఉపాధ్యాయుడికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది టీచర్లున్నారు. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఇంకా పది మంది ఉపాధ్యాయుల అవసరం ఉంది. 

విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి  
విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళపై పేదలు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. రా ష్ట్రంలో 594 మండలాలుంటే 20కి మించి మండల విద్యాధికారులు లేరు. తక్షణమే ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలి.  పదోన్నతులు కల్పించాలి. లేకపోతే ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
– జంగయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement