కేసముద్రం: పొలాల మధ్యలో బడి.. ఆ బడికి పొలం గట్టే దారి. ప్రతీరోజు విద్యార్థులు ఆ దారి గుండానే పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండా జీపీలో ప్రాథమిక పాఠశాల భవ నాన్ని పంట పొలాల మధ్య నిర్మించారు. అయితే పాఠశాలకు వెళ్లేందుకు మాత్రం దారిని ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు పొలం గట్టుమీద నుంచే వెళ్లి వస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు, టీచర్లు గట్టుమీద నుంచి జారి పడిన ఘటనలు ఉన్నాయి.
అలాగే పాఠశాల భవనం పక్కనే ప్రమాద కరంగా రెండు వ్యవసాయ బావులు ఉన్నాయి. బడికి చుట్టూరా పొలాలు ఉండటంతో పాములు, విష పురుగుల భయం ఉంది. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికైనా పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment