
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైటెక్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రి నిర్వహించిన అవగాహన ర్యాలీని హీరో సుమంత్ ప్రారంభించారు. తాతగారు చివరి దశలో క్యాన్సర్‌తో పోరాడటం బాధ కలిగించిందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. తన సినిమాల్లో కూడా పొగ తాగడం వంటి సీన్లను తగ్గించేశానని చెప్పుకొచ్చాడు. ఎవరైనా సిగరెట్ తాగే సీన్ చెప్పగానే అవసరమా అని వారిస్తున్నానని పేర్కొన్నాడు. కాకపోతే కొన్నిసార్లు పాత్ర డిమాండ్ మేరకు అలాంటి సీన్లలో నటించక తప్పదని తెలిపాడు. (చదవండి: ట్రైలర్: 'కపటధారి'ని సుమంత్ కనుక్కుంటాడా?)
తన ఫ్యామిలీలో చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోయారని, మరి కొందరు దాన్ని జయించారని చెప్పుకొచ్చాడు. మొదటి దశలోనే క్యాన్సర్‌ను కనిపెట్టగలిగితే దాన్నుంచే బయటపడే అవకాశం ఉందన్నాడు. యువత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించాడు. కాగా సుమంత్ ప్రస్తుతం "కపటధారి" సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. మరోవైపు మురళీకృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఐమా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. (చదవండి: హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి డేట్ ఫిక్స్)