రాష్ట్ర అధికారులతో సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 91 శాతం ప్రమాదాలకు అధిక వేగమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. అలాంటప్పుడు మితిమీరిన వేగాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏం చేస్తోంది? రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా కార్యాచరణ మొదలు పెడితే కనీసం పదేళ్లలో మంచి ఫలితాలొస్తాయి. కానీ అలాంటి లక్ష్యాలేవీ పెట్టుకున్నట్టు కనిపించడం లేదు’ అని రోడ్డు భద్రతపై నియమించిన సుప్రీంకోర్డు కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే అన్నారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత చర్యలు బాగా మెరుగుపడాల్సిన అవసరముందని కమిటీ అధ్యయనంలో తేలిందన్నారు.
జనవరిలో వారం పాటు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర వైద్యాన్ని అందించే ఆస్పత్రుల పరిస్థితిని తెలుసుకుంటానని చెప్పారు. రోడ్డు భద్రతకు సంబంధించి సమావేశాల్లో పాల్గొనేందుకు తమిళనాడు వెళ్తున్న ఆయన, విమానాల మార్పులో ఉండే విరామ సమయంలో రాష్ట్ర అధికారులతో ప్రత్యేకంగా భేటీఅయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులను కొన్ని అంశాలపై ఆయన సూటిగా నిలదీశారు. నియంత్రణ చర్యలకు సంబంధించి అధికారుల వివరాలకు సంతృప్తి వ్యక్తం చేయలేదు.
చదవండి: ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. కానిస్టేబుల్ తూటాలకు ఎస్‌ఐ బలి
ప్రమాదాలు జరగకుండా చూడాలిగా
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి అత్యవసర వైద్యం అందించేందుకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని, ట్రామా కేర్ సెంటర్లను అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు పేర్కొనడాన్ని జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే తప్పుబట్టారు. ‘క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సరే, అసలు ప్రమాదాలు జరగకుండా చూడాలిగా’ అని అన్నారు. ‘జపాన్, జర్మనీ, చైనాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటోందని, మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షన్నర మంది మరణిస్తున్నారని చెప్పారు.
2014లో రాష్ట్రంలో 70 లక్షల వాహనాలుంటే ఇప్పుడు రెట్టింపయ్యాయని, ప్రమాదాల సంఖ్య ఆ స్థాయిలో పెరగలేదని అధికారులు వివరించగా ఆయన స్పందిస్తూ.. ‘ఆ స్థాయిలో పెరగలేదని సంతోషపడొద్దు. తగ్గించలేకపోయామని గుర్తించాలి’ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశంలో 9వ స్థానంలో ఉందని, దీనిపై యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తే వ్యక్తి గత వాహనాల వాడకం తగ్గుతుందని సూచించారు.
చదవండి: చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో!
రోడ్లు బాగు చేస్తున్నాం.. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం
రోడ్డు భద్రతలో నిట్ వరంగల్ సేవలను తీసుకుంటామని, రోడ్డు భద్రత నిధికి మురిగిపోని విధంగా రూ.25 కోట్లు కేటాయించనున్నామని కమిటీ చైర్మన్‌కు అధికారులు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,839 కోట్లతో సమగ్ర రోడ్డు అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. నగరంలో ఇప్పటికే 6 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 6 లక్షలు ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఏడాది నిబంధనలు పాటించని 10,728 మంది డ్రైవింగ్ లైసెన్సు లు రద్దు చేశామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment