
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1654 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వానికి దక్కాయి. 2016 నుంచి సుప్రీంకోర్టులో జాగీర్ భూముల కేసు కొనసాగుతుండగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 1654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు లభించాయి.
కాగా ప్రభుత్వం, వక్ఫ్ బోర్డుమధ్య ఎన్నో ఏళ్లుగా భూముల వివాదం కొనసాగుతోంది. హజరత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు చెందిన 1654 ఎకరాల 32 గుంటలు తమవేనంటూ వక్ఫ్ బోర్డు కోర్టు కెక్కింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పలుమార్లు వాదనలు నడిచాయి. అయితే, 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
చదవండి: అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు!
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణా ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ ధర్మాసనం 156 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డు మధ్య నలుగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చదవండి: ఇసుక, సిమ్మెంట్ లేకుండా ఇల్లుని నిర్మించారు ఎలాగో తెలుసా!!