
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మెదక్(ధారూరు/బంట్వారం): ఈత సరదా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. ఈ ఘటన కోట్‌పల్లి ప్రాజెక్టులో శనివారం జరిగింది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన మేరకు.. మేడ్చల్ జిల్లా రాంపల్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఏడుగురు యువకులు శనివారం సరదాగా గడిపేందుకు ముందుగా అనంతగిరిగుట్టకు వచ్చారు. సాయంత్రం సమయంలో కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు వచ్చారు. ప్రాజెక్టు కట్ట వెనుక ఉన్న నీటిలో అందరూ కలిసి ఈత కొట్టడానికి దిగారు. వీరిలో సాయికుమార్‌రెడ్డి (28) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
గమనించిన తోటి స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు సాయికమార్‌రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ తిరుపతిరాజు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. కేసును కోట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: పేదోడి ఫ్రిడ్జ్‌కు భలే గిరాకీ!)