
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మతాంతర వివాహం చేసుకున్న ఒక దళిత యువకుడిని పరువు పేరిట యువతి కుటుంబం హత్య చేయడంపై విచారణకు ఎస్సీ కమిషన్ ముందుకు వస్తే ఒవైసీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. ఎవరిని రక్షించాలనుకుంటున్నారని, హంతకులు ఆయనకు ఏమవుతారని ప్రశ్నించారు.
హంతకులు తప్పించుకోవాలని టీఆర్‌ఎస్, ఎంఐఎం కోరుకుంటున్నాయని ఛుగ్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్‌ఛుగ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితుడి హత్య జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు కేవలం పొలిటికల్ టూరిజంలో భాగంగానే వెళ్లారని, ఆయనకు అక్కడి రైతులపై ఏమాత్రమైనా ఆవేదన ఉందా అని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు.