నామినేషన్ దాఖలు చేస్తున్న పాపన్నగారి మాణిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు హంగుఆర్భాటాలతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మద్దతు ఇస్తున్న ఇతర సంఘాలతో కలిసి తమబలాన్ని ప్రదర్శించేందుకు పోటీపడుతున్నారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులను తరలిస్తున్నారు.
టీఎస్‌యూటీఎఫ్ బలపరుస్తున్న పాపన్నగారి మాణిక్‌రెడ్డి సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో తన నామిషనేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఇందిరా పార్క్‌వద్ద భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తదితరులు హాజరయ్యారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాలు, మోడల్ స్కూల్స్ ఫెడరేషన్, పలువురు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాణిక్‌రెడ్డికి మద్దతు పలికారు.
నేడు భుజంగరావు నామినేషన్
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ(ఎస్టీయూటీఎస్) బలపరుస్తున్న అభ్యర్థి బి.భుజంగరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఎస్టీయూటీఎస్‌తోపాటు పలు సంఘాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. సీపీఐ నేతలు కూడా ఈ సభకు హాజరవుతున్నట్టు ప్రకటించారు.
మరోవైపు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు ఉపాధ్యాయులు కూడా నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 317 జీవో బాధితుల పక్షమంటూ కొంతమంది, స్పౌజ్ బాధితుల పేరుతో మరికొంతమంది నామినేషన్లు వేశారు. సంఘాలపై తీవ్ర అసంతృప్తి ఉన్న వాళ్లు పోటీ చేసి, తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment