సాక్షి, హైదరాబాద్: పోస్టుమాన్ ఊరూరూ తిరుగుతూ ‘సార్.. పోస్ట్’అనుకుంటూ ఉత్తరాలు పంచడం ఇప్పుడెక్కడా కనిపించట్లేదు. ఈకాలంలో ఎవరూ అసలు ఉత్తరాలే రాయట్లేదు. నేటి తరం వాళ్లకు చాలా మందికి అసలు పోస్టు కార్డు అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే ఇష్టాన్ని పెంచడానికి తపాలా శాఖ ఓ మంచి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందుకు ఆజాదీ కా అమృతమహోత్సవాలను వేదికగా చేసుకుంది.
75 లక్షల పోస్టు కార్డులను ప్రత్యేకంగా ప్రింట్ చేసి రాష్ట్రాలకు పంపింది. విద్యార్థులు అర్ధ రూపాయికి వాటిని కొని వ్యాసం రాసి పంపాలని పోటీ పెట్టింది. గెలిచిన వాళ్లకు బహుమతులతో పాటు నేరుగా ప్రధాని మోదీని కలవొచ్చని చెప్పింది. ఎంట్రీలకు ఈ నెల 20 చివరి తేదీ అని, రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా వ్యాసం రాసి పంపొచ్చని తెలిపింది.
మన రాష్ట్రానికి 3 లక్షలు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తపాలా శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 75 లక్షల పోస్టు కార్డులను ఎంపిక చేసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది. ఆసక్తి ఉన్న వాళ్లు అర్ధ రూపాయి చెల్లించి తపాలా కార్డు కొని దానిపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది.
డిమాండ్ లేకపోవటంతో తపాలా కార్డులను ఆ శాఖ ప్రింట్ చేయట్లేదు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కార్డులను ముద్రించింది. అన్ని రాష్ట్రాలకూ వాటిని పంపింది. రాష్ట్రానికి 3 లక్షల కార్డులను విద్యా శాఖ, కేంద్రం పరిధిలోని సీబీఎస్‌సీ పాఠశాలల అధికారులకు అందించింది. ఆసక్తి ఉన్న పాఠశాలల విద్యార్థుల నుంచి ఎంట్రీలు కోరుతోంది.
ఒక్కో విద్యా సంస్థ నుంచి 10కి మించకుండా..
స్వాతంత్య్ర సమరయోధులు, 2047 (వందేళ్ల స్వతంత్ర భారతం) నాటికి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు.. ఈ రెండు అంశాలపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. అలా రాసిన కార్డులను సంబంధిత విద్యా శాఖ అధికారులు సేకరిస్తారు. ఒక్కో విద్యా సంస్థ నుంచి 10 మించకుండా ఉత్తమమైన రచనలను గుర్తించాలి.
వాటిని https://innovateindia.mygov.in/postcardcampaign/ లో అప్‌లోడ్ చేయాలి. వాటిల్లోంచి అతి ఉత్తమమైన 75 ఎంట్రీలను ఎంపిక చేసి ఆ విద్యార్థులు జనవరి 17న స్వయంగా ప్రధానితో ముఖాముఖికి అవకాశం కల్పిస్తారు. బహుమతులు కూడా అందిస్తారు. ఇతర వివరాల కోసం దగ్గర్లోని పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చని తపాలా శాఖ అధికారులు చెప్పారు.
ఉత్తరాలు రాయడం అలవాటు చేయాలని..
తపాలా శాఖ పునరుత్తేజం పొందేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నా ఉత్తరాలు రాసే అలవాటును పెంచలేకపోతోంది. ఆ అలవాటు సమాజం నుంచి దాదాపు మాయమైంది. దీంతో నేటి తరానికి లేఖలు రాసే విష యంలో అవగాహన కూడా లేదు. గతంలో కొన్నిసార్లు మన్‌కీ బాత్ లాంటి కార్యక్రమాల్లో స్వయం గా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఉత్తరాలు రాస్తే కలిగే అనుభూతిని నేటి తరం కూడా పొందాలని.. స్నేహితులు, బంధువులకు సరదాగానైనా ఉత్తరాలు రాయాల ని పిలుపునిచ్చారు. ఫోన్‌లో పలకరింపుతో పోలిస్తే ఉత్తరం ద్వారా మాట్లాడటం గొప్ప అనుభూతి అన్నారు. కానీ ఆ దిశగా స్పందన రావట్లేదు. దీంతో విద్యార్థులతో ఉత్తరాలు రాయించే కార్యక్రమాన్ని చేపట్టాలని తపాలా శాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment