సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన సాంబయ్య ఉపాధి కోసం ఆటో నడుపుకోవాలనుకున్నాడు. షోరూమ్‌లో కొత్త ఆటో ధర రూ.2.35 లక్షలే. కానీ ఆటో బయటికి వచ్చి రోడ్డుపై తిప్పుకునేందుకు రూ.4.20 లక్షలకుపైనే ఖర్చయింది. ఇదెలా అని ఆశ్చర్యపోవద్దు. హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి ఉంది. ఒక పాత ఆటో తుక్కుకు వెళ్తేగానీ.. కొత్త ఆటో రోడ్డెక్కడానికి వీల్లేదు.
పెద్ద సంఖ్యలో పాత, పాడైపోయిన ఆటోల పర్మిట్లను చేజిక్కించుకున్న కొందరు.. ఆ పర్మిట్లను అడ్డుపెట్టుకుని కొత్త ఆటో కావాల్సిన వారి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ముసుగులో ‘పర్మిట్ల’ దందాకు పాల్పడుతున్నారు. వారి ప్రమేయం లేకుండా ఒక్క కొత్త ఆటో కూడా రోడ్డెక్కని పరిస్థితి. అధికారులకు ఇదంతా తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య లేకుండా పరిమితితో..
రోడ్ల సామర్థ్యానికి మించి ఆటోలు బయటికి వస్తే ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి విధించింది. ఎవరంటే వారు ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే తిరుగుతున్న ఆటోలు తుక్కు (స్క్రాప్) కింద మారితే ఆ స్థానంలో కొత్త ఆటోలు రోడ్డెక్కడానికి అనుమతి ఉంటుంది. అయితే ఎవరైనా పాత ఆటో ఉన్నవారు. దానిని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కు కింద మార్చేస్తే.. వారికి కొత్త ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దీనినే కొందరు దందాగా మార్చుకున్నారు.
ఏం చేస్తున్నారు?
ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల వరకు ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో 30 శాతం మాత్రమే యజమానుల చేతుల్లో ఉన్నాయి. మిగతావన్నీ కొందరు వ్యక్తులు, ఫైనాన్షియర్ల చేతుల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తవారు ఆటో కొనాలంటే.. ముందుగా ఓ పాత, తుక్కు దశకు చేరిన ఆటోను వారి పేరిట మార్చుతున్నారు. తర్వాత దాన్ని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కుగా చేసి, ఈ పర్మిట్‌ను కొత్త ఆటోకు వచ్చేలా చేస్తున్నారు. ఇలా పాత ఆటో పర్మిట్‌ను ఇచ్చేందుకు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా పాత పర్మిట్, కొత్త ఆటో కలిసి నాలుగున్నర లక్షలదాకా చేరుతోంది. అంటే ఓ చిన్న కారు ధరతో సమానంగా మారుతోంది.
కరోనా కష్టకాలంలో ‘పర్మిట్లు’ పట్టేసుకుని
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్లు, ఇతర పరిణామాలతో బడుగుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఆటోలు నడుపుకొనే వారి ఉపాధికి దెబ్బతగిలింది. ఆదాయం లేకపోవడం ఓవైపు.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారినపడటమో, ఇతర అవసరాలతోనో డబ్బులు అవసరం పడటం మరోవైపు కలిసి.. చాలా మంది ఆటోలను అమ్ముకున్నారు.
కొందరు ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని పాత, తుక్కు దశకు చేరుకున్న ఆటోలను తక్కువ ధరకు పెద్ద సంఖ్యలో కొనేసి పెట్టుకున్నారు. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో మళ్లీ ఆటోలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడా పాత ఆటోల పర్మిట్లను అడ్డుపెట్టుకునిదందా కొనసాగిస్తున్నారు. డిమాండ్ పెరిగిన కొద్దీ ‘పర్మిట్ల’ రేట్లు పెంచేస్తున్నారు.
ఫైనాన్స్ కట్టలేని వారి నుంచి..
హైదరాబాద్ నగరంలో ఆటోలకు ప్రైవేటుగా ఫైనాన్స్ చేసే వ్యక్తులు సుమారు 310 మందిదాకా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తిరుగుతున్న మొత్తం ఆటోల్లో 70 శాతం వరకు వీరు ఆర్థిక సాయం చేసినవే. ఈ అప్పులపై విపరీతంగా వడ్డీ ఉంటుంది. ఆటో సరిగా నడవక, తగిన ఆదాయం రాక, ఇల్లు గడవడానికి సంపాదన సరిపోక చాలా మంది రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం లేదు. అలాంటి ఆటోలను ఫైనాన్షియర్లు లాగేసుకుంటున్నారు. వాటిని అద్దెకు ఇచ్చినంత కాలం ఇచ్చి.. డొక్కుగా మారాక ‘పర్మిట్ల’ దందా కోసం వాడుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రవాణా శాఖ సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
వెంటనే చర్యలు చేపట్టాలి
ఆటో పర్మిట్ల విక్రయం దందా తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియర్లు అక్రమ దందా చేస్తున్నారు. ఇటీవల ఇది మరింత తీవ్రమైనా చూసీచూడనట్టు ఉంటుండటం అనుమానాలకు తావిస్తోంది. బడుగుల జేబులను కొల్లగొడుతున్న ఈ దందాను అరికట్టాల్సి ఉంది
– దయానంద్, తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment