ఇంట్లోంచి మెట్రోస్టేషన్‌కు.. అక్కడి నుంచి ఆఫీసు దగ్గరలోని స్టేషన్‌కు.. ఆ తర్వాత కాళ్లకు పనిచెప్పో, ఏదో క్యాబ్‌లోనో, ఆటోలోనో ఆఫీసుకు.. చాలా మంది మెట్రో నగర వాసుల రోజువారీ తంతు ఇది.. ఇంత శ్రమ ఎందుకనుకునే వారు కారులోనో, బైక్‌పైనో ఆఫీసుకు వెళ్లొస్తున్నారు. దీనితో ఓ వైపు తీవ్రమైన ట్రాఫిక్.. కాలుష్యం.. మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జేబుకు చిల్లు! దీనంతటికీ ప్రత్యామ్నాయం.. కృత్రిమ మేధతో పనిచేసే ‘మెట్రోరైడ్’అంటోంది బెంగళూరు కంపెనీ!!
సాక్షి, హైదరాబాద్: స్కూళ్లు, వ్యాపారాలు, ఆఫీసులు.. దేనికైనా వెళ్లిరావడానికి మెట్రోరైలుతో ఎంతో ఉపయోగం. కానీ మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు ట్యాక్సీలు వెంటనే దొరకవు. దొరికినా రేట్లు ఎక్కువ. ఆటోడ్రైవర్లు కూడా సమయాన్ని ఎక్కువ చార్జీ వసూలు చేస్తుంటారు. అలాగాకుండా.. మనం ఇంటి దగ్గర్నుంచే మెట్రో స్టేషన్‌కు.. మరో స్టేషన్‌లో రైలుదిగాక ఆఫీసుకో, కాలేజీకో వెళ్లేందుకు ఓ ఆటో ఎప్పుడూ రెడీగా ఉంటే..?
అదీ తక్కువ చార్జీ వసూలు చేస్తే..? ఇలాంటి ఆలోచనతోనే బెంగళూరుకు చెందిన ‘థింక్‌క్రేజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’సంస్థ కృత్రిమమేధ (ఏఐ) సాయంతో పనిచేసే ‘మెట్రోరైడ్’ను అందుబాటులోకి తెచ్చింది. పైగా కాలుష్యం ఉండకుండా అన్నీ ఎలక్ట్రిక్ ఆటోలతోనే సర్వీసు ఇస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
‘మెట్రోరైడ్’స్మార్ట్‌ఫోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైనప్పుడు ప్రయాణాన్ని బుక్ చేసుకుంటే సరి. వికీ అనే పేరుతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కృత్రిమమేధ వ్యవస్థ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇంటికి దగ్గరగా ఉండే మెట్రోరైడ్ పార్కింగ్ వద్దకు వెళితే చాలు.. ఎలక్ట్రిక్ ఆటో మిమ్మల్ని మెట్రోస్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటుంది. మీరు దిగే మెట్రోస్టేషన్ బయట పార్కింగ్ వద్దకు వస్తే చాలు.. మీ ఆఫీసు గుమ్మం వరకు చేర్చేందుకు మరో ఆటో రెడీగా ఉంటుంది. ఇలా ఇళ్లు, ఆఫీసులు అనే కాదు స్కూళ్లు, కాలేజీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు సులువగా వెళ్లొచ్చేందుకు వీలుంటుంది.
♦అంతేకాదు ఒకవేళ మహిళా ప్రయాణికులైతే.. మహిళా డ్రైవర్ నడిపే ఆటోను అందుబాటులోకి తెస్తుంది. మెట్రోరైడ్ ఆటోడ్రైవర్లలో 20 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం.
♦ఎవరైనా ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులు ఒకే సమయంలో, ఒకే రూట్‌వైపు వెళుతుంటే.. వారిని ఒకే ఆటోలోకి చేర్చి.. తదనుగుణంగా సగం సగం చార్జీలు వసూలు చేస్తుంది.
♦ప్రస్తుతం మెట్రోరైడ్ వ్యవస్థ ప్రతి మెట్రోస్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తోంది. చార్జీలు తక్కువే. సగటున ఒక్కో ప్రయాణానికి రూ.18 వరకు వసూలు చేస్తున్నారు. తొలి కిలోమీటర్ దూరానికి రూ.పది చెల్లించాలి. గరిష్ట చార్జీ రూ.30 వరకు ఉంటుంది.
♦ప్రస్తుతం బెంగళూరుతోపాటు నోయిడా, న్యూఢిల్లీల్లో మెట్రోరైడ్ పనిచేస్తోంది. మొత్తంగా 1.40 లక్షల మంది మెట్రోరైడ్‌ను ఉపయోగించుకుంటున్నారు.
హైదరాబాద్‌లోనూ మెట్రోరైడ్ సర్వీసులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే సర్వీసులు మొదలవుతాయి.
– గిరీశ్ నాగ్‌పాల్, సీఈవో, మెట్రోరైడ్
Comments
Please login to add a commentAdd a comment