సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.175.46 కోట్లు ఎక్కువగా రూ.5,697.55 కోట్లను సర్కారు కేటాయించింది. నిర్వహణ పద్దులో పెరుగుదల ప్రభావంతో ఈ మేరకు బడ్జెట్ పెరిగినా సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు పెరగలేదు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.90 కోట్లు కేటాయించింది. 42 కులాల ఆత్మగౌరవ భవనాల కోసం ఇప్పటికే స్థలాలను ప్రభుత్వం నిర్దేశించగా తాజా కేటాయింపులతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
కార్పొరేషన్లకు కోత.. ఫెడరేషన్లకు కొంత..
బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు తాజా బడ్జెట్ నిరాశ కలిగించింది. 2021–22 బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. తాజా బడ్జెట్‌లో ఒక్కో కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున ప్రకటించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.400 కోట్లు కోతపడింది. ఫెడరేషన్లకు గత బడ్జెట్‌లో రిక్త హస్తం చూపినా తాజా బడ్జెట్‌లో 12 ఫెడరేషన్లకు సింగిల్ డిజిట్‌లో నిధులు కేటాయించింది. ఉచిత విద్యుత్ పథకం కింద రజకులకు రూ.50 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.50 కోట్లు చొప్పున ప్రకటించింది.
ఎస్సీలకు దండిగా.. ఎస్టీలకు మెండుగా..
ఎస్సీ అభివృద్ధి శాఖకు తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు భారీగా కేటాయించింది. రూ.20,624.88 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే పద్దు రూ.15,036.91 కోట్లు పెరిగింది. దళితబంధు పథకానికి ఏకంగా రూ.17,700 కోట్లు ప్రకటించడంతో బడ్జెట్ అమాంతం పెరిగింది. గిరిజన సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,415.41 కోట్లను కేటాయించింది. ఈ పద్దు గత బడ్జెట్‌తో పోలిస్తే 359.29 కోట్లు పెరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్ కన్నా రూ.122.32 కోట్లు ఎక్కువగా రూ.1,728.71 కోట్లను ప్రకటించింది. నిధులు దాదాపు 7 శాతం మేర పెరగడంతో పెండింగ్ పథకాలకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment