సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) పోస్టులను రద్దు చేసేందుకు రూపొందించిన ‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020’ను ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ‘ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్ –2020’ పేరుతో రూపకల్పన చేసిన కొత్త రెవెన్యూ చట్టానికి కూడా ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనలో కీలక సంస్కరణలకు సంబంధించిన బిల్లులు, ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపారు. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్‌లను త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. భూములపై రైతులు, భూ యజమానుల హక్కులను పరిరక్షించడం.. రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిన అవినీతి, అక్రమాలను రూపుమాపడం కోసం వీఆర్వో పోస్టుల రద్దుతో పాటు కొత్త రెవెన్యూ చట్టం బిల్లులను తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల కారణంగానే గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులు భ్రష్టుపట్టాయని, ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని సర్వత్రా ఆరోపణలు ఉండటంతో ఈ పోస్టులను రద్దు చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
సాదా బైనామాలు చెల్లవు..
తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు –2019లోని సవరణ బిల్లు, పంచాయతీరాజ్–రూరల్ డెవలప్‌మెంట్–గ్రామ పంచాయత్స్–ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు–2018 సవరణ బిల్లులను కేబినెట్ ఆమోదించింది. కొత్త రెవెన్యూ చట్టానికి అనుబంధంగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఈ బిల్లులను ప్రభుత్వం తెచ్చింది. ఖాళీ స్థలాలను సాదా బైనామా ద్వారా క్రయావిక్రయాలు చేస్తే ఇకపై చెల్లదని కొత్త నిబంధనలను ఈ బిల్లుల ద్వారా తీసుకురాబోతోంది. సాదాబైనామాలతో భూకబ్జాలు, అక్రమ లావాదేవీలు చోటు చేసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. లే–అవుట్ అనుమతి/ఎల్‌ఆర్‌ఎస్ కలిగి ఉండటం, రిజిస్ట్రేషన్ చేయించడాన్ని తప్పనిసరి చేయనుంది. భవనాలు, లే–అవుట్‌ల అనుమతులను పారదర్శకంగా జారీ చేసేందుకు రూపొందించిన టీఎస్ బీపాస్ బిల్‌ను ఆమోదించింది.
జీతాల్లో కోత బిల్లుకు ఆమోదం..
ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్–2002ని కేబినెట్ ఆమోదించింది. విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో జీతాలు, పెన్షన్లలో కొత విధించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. అలాగే ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ –2020కు కేబినెట్ ఓకే చెప్పింది. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సు్క కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వయోపరిమితి 65 ఏళ్లకు పెరగనుంది.
బీసీ జాబితాలో 17 కొత్త కులాలు..
బీసీల జాబితాలో 17 కులాలను చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. అద్దపువారు, బాగోతులు, బైల్ కమ్మర, ఏనూటి, గంజికూటివారు, గౌడజెట్టి, కాకిపడగల, మాసయ్యలు/పటంవారు, ఒడ్, సన్నాయోల్లు, శ్రీక్షత్రియ రామజోగి, తెరచీరలు, తోలుబొమ్మలవారు/బొప్పల కులాలను బీసీ–ఏలో.. అహీర్ యాదవ్, గొవిలి, కుల్లకడగి, సారోళ్లు కులాలను బీసీ–డీలో చేర్చాలని బీసీ కమిషన్ సిఫారసు చేసింది.
కేబినెట్ ఇతర నిర్ణయాలు...
- తెలంగాణ జీఎస్టీ యాక్టు –2017లో సవరణ బిల్లుకు ఆమోదం
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్–2020కి గ్రీన్‌సిగ్నల్
- తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు –1956 సవరణ బిల్లుకు, ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు –1972 కు సవరణ బిల్లుకు అనుమతి.
- రూ.400 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఓకే.
- కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు ఆమోదమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment