పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ఈ కార్యక్రమమే స్ఫూర్తి
రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల కొనసాగింపు
19వ అలయ్ బలయ్ వేడుకలో సీఎం రేవంత్
రాష్ట్ర నేతలు తమ భాష మార్చుకోవాల్సిన అవసరముందన్న కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడానికి, గౌరవించడానికి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికే కాకుండా, నాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ కార్యక్రమం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఆలోచనతో బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. చివరకు స్వరాష్ట్రం సాధించుకోవడానికి కూడా దోహదపడిందని పేర్కొన్నారు. దసరా పండుగ నేపథ్యంలో హరియాణా గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 19వ అలయ్ బలయ్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయే..
‘తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా.. దసరా అంటే మొట్టమొదట పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే కూడా బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు. ఆయన అందించిన సంస్కృతి, వారసత్వ లక్షణాలతో దత్తాత్రేయ వారసురాలిగా బండారు విజయలక్ష్మి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. రాజకీయాలకు అతీతంగా మా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు దీనికి హాజరై రాష్ట్ర సంప్రదాయాలు కొనసాగించడంలో రాజకీయాలకు తావు లేదని నిరూపించాం. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులు, వివిధ సంఘాల వారు కూడా ఏకమై అంతా ఒకటేనని సందేశాన్నివ్వడం అభినందనీయం..’అని సీఎం పేర్కొన్నారు.
వేరే రాష్ట్రానికి గవర్నర్ అయినా తెలుగు బిడ్డనే: దత్తాత్రేయ
‘నేను ఇప్పుడు వేరే రాష్ట్రానికి గవర్నర్ అయినా తెలుగు బిడ్డనే. అందుకే స్థానిక కళాకారులు, కుటీర పరిశ్రమలకు చెందిన కుమ్మరి, కమ్మరి, చేనేత, గీత కారి్మకులు తదితర వర్గాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశా. వారికి ప్రత్యేకంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహం అందించాల్సిన అవసరముంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదరభావంతో ముందుకు సాగాలి..’అని దత్తాత్రేయ ఆకాంక్షించారు.
ఐక్యతను ప్రతిబింబిస్తుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
‘విజయలక్ష్మి అలయ్ బలయ్‌ను కొనసాగించడం అభినందనీయం. గ్రామాల్లో పొలాల గెట్ల గొడవలు, ఇంట్లో మనస్పర్థలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దసరా జమ్మి పూజ చేశాక అంతా కలిసి అలయ్ బలయ్ తీసుకోవడం తెలంగాణ సంస్కృతి. దత్తన్న అలయ్ బలయ్ దీనినే ప్రతిబింబిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, విభేదాలు ఉండొచ్చు కానీ ఇలా కలవడం మంచి విషయం. ఎన్నికల సమయంలో విమర్శించుకోవచ్చు.. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది లోపించింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ భాష మార్చుకోవాలి. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలయ్ బలయ్ స్ఫూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి..’అని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఉద్రేకాలు రగిలించడాన్ని నియంత్రించాలి: పొన్నం
‘రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలంటూ కిషన్‌రెడ్డి చేసిన సూచన వంద శాతం సమంజసం. అదే విధంగా మత పరమైన ఉద్రేకాలను రగిలించే మాటలను కూడా నియంత్రించేలా చొరవ చూపించాల్సిన అవసరం ఉంది..’అని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ సంస్కృతి కొనసాగాలి
ఉత్తరాఖండ్, రాజస్తాన్, మేఘాలయ గవర్నర్లు
‘గతంలో బొల్లారంలోని యూనిట్‌లో పని చేశా. ఇక్కడి సంస్కృతి అద్భుతమైనది. శాంతికి సంకేతంలా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ఈ సంస్కృతి ఇలాగే శతాబ్దాలు కొనసాగాలని ఆశిస్తున్నా..’అని ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ గుర్మిత్ సింగ్ అన్నారు. అలయ్ బలయ్ మంచి సంస్కృతి అని రాజస్తాన్ గవర్నర్ హరిభావ్ బగాదే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేతల మధ్య ఆత్మీయత, అనుబంధాలను పెంచుతోందని మేఘాలయ గవర్నర్ విజయశంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, నేతలు ఈటల రాజేందర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రఘునందన్ రావు, కోదండరాం, వి.హన్మంతరావు, లక్ష్మణ్, కె.కేశవరావు, గోరటి వెంకన్న, వందే మాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అద్భుతమైన సంస్కృతి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
‘భారతీయ సంస్కృతి అంటేనే ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం. దీనిని ప్రతిబింబించేలా నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం చాలా బాగుంది. ఇక్కడి సంస్కృతిలో విభిన్న మతాలను సైతం సమానంగా చూసే తత్వముంది. సీనియర్ నేత దత్తాత్రేయ అద్భుతమైన స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం హర్షణీయం..’అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment