సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వరుస సభలు, చేరికలతో జోష్ కనిపిస్తున్నా.. సంస్థాగతంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. సంస్థాగతంగా పటిష్టం కావాల్సిన రాష్ట్ర కార్యవర్గంపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడంతో పలు వేదికల్లో పార్టీ పలుచబడిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాలకు నూతన అధ్యక్షులు, పీసీసీ సభ్యులు.. ఇలా సంస్థాగతంగా నియామకాలు ఏడాది నుంచి జరగకపోవడంతో పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ఇంకెప్పుడు కమిటీలు
తెలంగాణ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగి ఏడాది పూర్తయ్యింది. ఆయనతోపాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, పది మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల పదవీ కాలం కూడా ఏడాది గడిచిపోయింది. కొంతమంది అధికార ప్రతినిధులను నియమించినా పెద్దగా పార్టీ లైన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లిన దాఖలాల్లేవు. అలాగే, పార్టీకి ప్రధాన కార్యదర్శుల నియమాకం ముఖ్యమైనా.. ఇప్పటివరకు దానిపై దృష్టి పెట్టినట్టు లేదు.
అటు పీసీసీ సభ్యుల నియామకంపై కసరత్తు జరుగుతున్నా.. ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ప్రధాన కార్యదర్శులుంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధత్యలు అప్పగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో వేగవంతం చేస్తూ కేడర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆ మేరకు ఆలోచనలు గానీ, కార్యాచరణ గానీ జరిగిన కనిపించదనే చర్చ జరుగుతోంది. పార్టీ లైన్‌ను, పార్టీ విధానాలను ప్రజల్లోకి వివిధ మాధ్యమాల ద్వారా తీసుకెళ్లాల్సిన అధికార ప్రతినిధుల పనితీరు ఇంకా మారాల్సిన అవసరం ఉందన్న వాదన పార్టీలో వినిపిస్తోంది.
జిల్లా అధ్యక్షుల నియామకంపై ఏకాభిప్రాయమేదీ?
కొత్త పీసీసీ కార్యవర్గం వచ్చాక మూడు నాలుగు జిల్లాలకు మినహా మెజారిటీ జిల్లాలకు అ«ధ్యక్షుల నియామకం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రతీ జిల్లాలో జిల్లా అధ్యక్షుల నియామకంపై కీలక నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండలో నూతన జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు కనిపించడంలేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షుల నియామకం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కత్తిమీద సాముగా మారిందని అంటున్నారు. ఇకపోతే మెదక్ ఉమ్మడి జిల్లాలో మదన్‌మోహన్‌రావు, అజహరుద్దీన్, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి మధ్య ఏకాభిప్రాయం వచ్చేలా లేదు. అటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మహేశ్ కుమార్‌గౌడ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్ మధ్య కూడా జిల్లా అధ్యక్షుల నియామంపై గ్రూప్ వార్ నడుస్తోందనే చర్చ పార్టీలో జరుగుతోంది.
ఆదిలాబాద్‌లో పెద్దగా సమస్య లేకపోయినా మంచిర్యాల జిల్లా అధ్యక్ష స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్‌లోని పెద్దపల్లి జిల్లా అధ్యక్ష ఎంపిక రేవంత్‌తోపాటు మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. వరంగల్‌లో జంగా రాఘవ రెడ్డి వర్సెస్ నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీల నియామకం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరిల మధ్య ఏకాభిప్రాయం రావడం కష్టంగానే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
సొంత కోటరీతో రేవంత్ రెడ్డి
సంస్థాగత నిర్మాణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టినా.. పెద్దగా సక్సెస్ కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీసీసీల మార్పు విషయంలో ఏఐసీసీ స్థాయిలో వస్తున్న ఒత్తిళ్లు, సీనియర్ నేతల అసంతృప్తి.. ఇలా అనేక వ్యవహారాలు సంస్థాగత మార్పులకు అడ్డంకిగా మారాయి. దీంతో తన కోటరీలో ఉన్న ఓ ఐదారుగురు నేతలతో కార్యకలాపాలను నెట్టుకొస్తున్నట్టు కనిపిస్తోంది.
పైగా పాత కాపులను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చిన ప్రాముఖ్యత తమకు కల్పించడం లేదన్న ఆరోపణలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల పనితీరు ఆశించిన మేరకు ఉండడం లేదన్న చర్చ నడుస్తోంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూప్ రాజకీయాలతో ఒక జిల్లా నేత మరో జిల్లాలో ప్రభావం చూపిస్తుండటం ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment