సాక్షి, హైదరాబాద్: పెద్దల మనసు మారింది.. పేదల సరసన చేరారు.. వద్దనుకున్న రైతుబంధు సొమ్ము తమకు కూడా ముద్దంటున్నారు.. ‘అప్పుడు ఏదో తెలియక గివ్ ఇట్ అప్ పథకం కింద రైతుబంధు సొమ్ము వెనక్కు ఇచ్చాం. పొరపాటు చేశాం. ఇప్పుడు మాకు రైతుబంధు సొమ్ము కావాలి. గివ్ ఇట్ అప్ కింద మేం ఇచ్చిన హామీని రద్దు చేయండి’అంటూ వ్యవసాయశాఖకు కొందరు పెద్దల నుంచి విన్నపాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద రైతులు ఎవరైనా ఆ సొమ్మును వద్దనుకుంటే, వెనక్కు ఇచ్చేలా గివ్ ఇట్ అప్ పథకాన్ని ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టింది.
అలా వచ్చిన డబ్బును రైతుబంధు సమితికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. మొదట్లో రైతుబంధు సొమ్ము తీసుకున్న పెద్ద రైతులు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సినిమా నటులు తదితర పెద్దలు చెక్కులను వెనక్కు ఇచ్చారు. అప్పట్లో దాదాపు రూ.2.50 కోట్ల వరకు సొమ్మును వదులుకున్నారు. కానీ, అలా వదులుకున్నవారు తిరిగి తాము రైతుబంధు సొమ్ము తీసుకుంటామని, తామిచ్చిన గివ్ ఇట్ అప్ హామీని రద్దు చేయాలని ఇప్పుడు వ్యవసాయశాఖకు విన్నవించుకుంటున్నారు. ఇది స్వచ్ఛందం కావడంతో వ్యవసాయశాఖ కూడా వారి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంది. వారికి సొమ్ము ఇచ్చింది. దీంతో ఈసారి గివ్ ఇట్ అప్ కింద సొమ్ము వదులుకున్నవారి సంఖ్య భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
పెద్దలు తీసుకోవడంపై విమర్శలు
తనకూ పెట్టుబడి సొమ్ము వస్తుందని, అయితే స్వచ్ఛందంగా వదులుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో రైతుబంధు సమితి సదస్సులో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సినిమా పెద్దలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలువురు అదే బాటలో నడిచారు. పేద, మధ్య తరగతి రైతులకు దక్కాల్సిన సొమ్మును పెద్దలు తీసుకుంటే ప్రజల్లో విమర్శలు వస్తాయి కాబట్టి వారిని తప్పించేందుకు ప్రభుత్వం గివ్ ఇట్ అప్ పథకాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనేతలు స్వచ్ఛందంగా వదులుకునేలా చేస్తే మంచి పేరు వస్తుందని ప్రభుత్వం భావించింది. అయితే 50 ఎకరాలుంటే ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ. 5 లక్షలు వస్తాయి. ఇలా భారీగా భూములున్నవారు లక్షలాది రూపాయలు వదులుకోవడానికి ఇప్పుడు ఏమాత్రం సిద్ధంగా లేరని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. వందల కోట్ల ఆస్తిపరులు కూడా ఈ సొమ్మును తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment