సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆ పనిలో నిమగ్నమైంది. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఉన్నత స్థాయిలో దీనిపై చర్చించాయి. ప్రైవేట్, కార్పొ రేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డబ్బులు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో సీఎం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఆరోగ్యశ్రీ కోసం ఎదురుచూపు...
కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పుడు నగ రాలు, పట్టణాలను దాటి పల్లెలపై పంజా విసురుతోంది. దీంతో పేదలు అనేకమంది కరోనా బారినపడుతున్నారు. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే కరోనా వచ్చి సీరియస్ అయి ఆసుపత్రుల్లో చేరి ఆస్తులు అమ్ముకున్నవారు అనేకమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీలోకి కరోనాను ఎప్పుడు తీసుకొస్తారా అని రాష్ట్రంలోని పేదలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 338 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుదారులు 77.19 లక్షల మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీలోకి కరోనాను తీసుకొస్తే పేద బాధితులు ప్రయోజనం పొందుతారు. ఇదిలావుంటే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) పరిధిలోకి కూడా కరోనా చికిత్సను తీసుకురావాలని ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
ప్యాకేజీ ఖరారే కీలకం...
కరోనా సాధారణ వైద్య చికిత్స మాత్రమే. ఇదేమీ ప్రత్యేకంగా నిర్దేశిత ఆపరేషన్ ప్రక్రియ కాదు. కాబట్టి ప్యాకేజీని ఆసుపత్రులు దుర్వినియోగం చేయకుండా చూడడమే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న పెద్ద సవాల్. అందుకే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రెండు అంశాల ఆధారంగా ప్యాకేజీ ఖరారుపై దృష్టిసారించింది. ఒకటి ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద కరోనా ప్యాకేజీని అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావడం. రెండోది ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనాకు ఎంత ఫీజులు వసూలు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా ప్యాకేజీ ఖరారు చేయడం. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు రాష్ట్రంలో సర్కారు నిర్దేశించిన ఫీజు సాధారణ వార్డులో చికిత్స పొందితే రోజుకు రూ. 4 వేలు, ఆక్సిజన్ వార్డులో రూ. 7,500, ఐసీయూలో రూ. 9 వేల చొప్పున ఉంది. పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా వాటికి అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ ఇవి ఆచరణలో అమలు కాలేదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే పేదలందరికీ ఈ ఫీజుల ఆధారంగానే ప్యాకేజీ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. అవసరమైతే పీపీఈ కిట్లు, మందుల ధరలు కొంత కలిపి ఒక నిర్దేశిత ప్యాకేజీ ఖరారు చేస్తామని చెబుతున్నాయి.
చేరేవారు లేక ఖాళీగా పడకలు...
అయితే ప్రస్తుతం సర్కారు నిర్దేశించిన ఫీజుల ప్రకారమే ఆరోగ్యశ్రీలో కరోనా ప్యాకేజీ ప్రకటిస్తే ఏంచేయాలన్న దానిపై ఆసుపత్రి వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే 14 రోజులకు సాధారణ వార్డుల్లో ఉండే వ్యక్తి నుంచి రూ. 56 వేలు, ఆక్సిజన్‌పై ఉంటే రూ. 1.05 లక్షలు, ఐసీయూలో చికిత్స చేస్తే రూ. 1.26 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా సేవలకు కలిపినా కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. ఇది తమకు గిట్టుబాటు కాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గతంలో ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఇక ఇతర నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎలా వ్యవహరిస్తాయన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతం 203 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందుబాటులోకి వచ్చింది. అందులో 10,660 పడకలు కరోనాకు కేటాయించారు. అయితే వాటిల్లో 4,248 పడకలే నిండగా, ఇంకా 6,412 పడకలు ఖాళీగా ఉన్నాయి. భారీగా పడకలు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీనే ఆసుపత్రులు ఒప్పుకోకతప్పదని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏ ప్యాకేజీ ఖరారు చేసినా దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది.
ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స..ప్యాకేజీపై కసరత్తు
Published Tue, Sep 15 2020 1:12 AM | Last Updated on Tue, Sep 15 2020 3:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment