సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రకటనకు ప్రతిగా విడుదలైన ‘అనధికారిక’ లీక్‌లో తీవ్ర విమర్శలే ఉన్నాయి. ప్రభుత్వాన్ని గవర్నర్ కావాలనే ఇబ్బంది పెడ్తున్నారని, కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందులో ఆరోపణలు గుప్పించారు. అందులోని అంశాలు ఇవీ.. ‘‘సాధారణంగా గవర్నర్లు, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే సీఎం కేసీఆర్‌తో గవర్నర్ తమిళిసైకి ఎక్కడ విభేదాలు వచ్చాయన్న దానిపై అనేక చర్చలున్నాయి. గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కేసీఆర్‌తో విభేదించారు. కేసీఆర్ సీఎం అయ్యాక కూడా ఆయనే గవర్నర్‌గా కొనసాగారు. అయినా ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది. రాష్ట్ర పాలనా యంత్రాంగానికి, సీఎంకు గవర్నర్ వ్యవస్థ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. సీఎం కూడా గవర్నర్ వ్యవస్థకు తగిన గౌరవమిచ్చారు. రెండు వ్యవస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది. ఇప్పుడది లేకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వ కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు
ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
► రాష్ట్ర మంత్రివర్గం కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది. వాటిని గవర్నర్ ఆమోదించలేదు. అలాగని తిరస్కరించకుండా చాలా కాలం దగ్గర పెట్టుకున్నారు. దానిని ఆమోదించాలని ప్రభుత్వ వర్గాలు కోరినపుడు.. కౌశిక్‌రెడ్డిపై కేసులున్నాయని చెప్పారు. అలా భావిస్తే సిఫార్సును తిరస్కరించాలని కోరినా గవర్నర్ స్పందించలేదు. ప్రభుత్వ మాటకు విలువ ఇవ్వలేదు. కౌశిక్‌రెడ్డిపై కేసులున్నా.. శిక్షపడితే మాత్రమే అనర్హుడు అనొచ్చు. కానీ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సిఫార్సును తొక్కిపెట్టారన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది.
► శాసనమండలికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీనిపైనా గవర్నర్ నాన్చివేత ధోరణితో వ్యవహరించారు. ప్రొటెం చైర్మన్ ఎందుకు, నేరుగా చైర్మన్ ఎన్నిక పెట్టాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో 13 నెలలపాటు ప్రొటెం చైర్మనే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పినా గవర్నర్ వినలేదు. రాష్ట్ర ప్రభుత్వం చివరికి దేశంలో ఏయే రాష్ట్రాల్లో ప్రొటెం చైర్మన్లుగా ఎన్నినెలలు, ఎంత కాలం ఉన్నారన్న సమాచారాన్ని సేకరించి గవర్నర్‌కు అందజేసింది. రాజ్యాంగం ఏం చెప్తున్నదో వివరించింది. ఆ తర్వాతే జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
► గవర్నర్ అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి ప్రసంగించినా.. జనవరి 26 నాడు జెండా ఎగురవేసి మాట్లాడినా.. ప్రభుత్వం (మంత్రి మండలి) ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే చదవాలి. సొంతంగా ప్రసంగాలు చేయడానికి వీల్లేదు, రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రభుత్వం ఈసారి జనవరి 26న గవర్నర్‌కు ప్రసంగాన్ని పంపలేదు. కానీ గవర్నర్ సొంత ప్రసంగాన్ని చదివారు. వాస్తవానికి జనవరి 26కు సంబంధించి ప్రభుత్వం గవర్నర్‌తో చర్చలు జరిపింది. కరోనా నేపథ్యంలో బహిరంగ సభ లేదు కాబట్టి ఎలాంటి ప్రసంగాలూ వద్దనుకున్నా.. గవర్నర్ ప్రసంగించారు. ఇది ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యగానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.
► 2021–22 బడ్జెట్ ప్రసంగంలో మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను గవర్నర్ సొంతంగా చదివారు. అప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించలేదు.
► దేశంలో, మన రాష్ట్రంలో గవర్నర్లకు, ప్రభుత్వాలకు మధ్య ఘర్షణాత్మక వైఖరి తలెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో రాంలాల్ గవర్నర్‌గా ఉన్నపుడు నాటి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన అవమానకరంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కృష్ణకాంత్ గవర్నర్‌గా ఉన్నప్పుడూ అలాగే జరిగింది. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ తన అతి వల్ల శాసనసభ నుంచి అవమానకరంగా సభ జరుగుతుండగానే నిష్క్రమించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ధోరణి గవర్నర్లకు ముఖ్యం. కేంద్ర ప్రభుత్వాలకు తోలుబొమ్మలుగా మారిన ఏ గవర్నర్ కూడా ఎక్కువ కాలం రాష్ట్రాల్లో పనిచేయలేకపోయారు. అయినా ఇప్పటికీ తెలంగాణలో పరిస్థితి చేయిదాటిపోలేదని.. గవర్నర్ సవరించుకుంటేనే మంచిదని రాజ్యాంగ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు’’ అని లీక్‌లో విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెడుతున్నారు!
Published Sun, Mar 6 2022 3:44 AM | Last Updated on Sun, Mar 6 2022 1:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment