సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ శాఖల్లో ఏళ్లకేళ్లుగా రిటైర్డ్ అధికారులే రాజ్యమేలుతున్నారు. పదవీ విరమణ పొంది దశాబ్దం గడిచినా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. సీఎంవో, విద్యుత్, నీటి పారుదల, ఆర్థిక శాఖ, ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ, జల మండలి, పౌర సరఫరాలు, మెట్రో రైలు వంటి ముఖ్యమైన శాఖలు, విభాగాల్లో రిటైర్డ్ అధికారులే పెత్తనం చెలాయిస్తున్నారు.
గతంలో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన ఉన్నధికారులు రిటైరైతే.. రెండేళ్ల సర్వీసు పొడిగించేవారు. మరీ అవసరౖమెతే రెండేళ్లకోసారి అలా పెంచుకుంటూ వెళ్లేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వర్తించేలా (అన్‌టిల్ ఫర్దర్ ఆర్డర్) అధికారుల పదవీకాలాన్ని పొడిగించేస్తోంది. దీంతో ఆయా అధికారులు ‘అన్ లిమిటెడ్ సర్వీసు’ను పొందుతున్నారు.
ఇలా రిటైర్డ్ అధికారులే ఏళ్ల తరబడి కీలక పోస్టుల్లో కొనసాగుతుండటంతో.. సీనియారిటీ ప్రకారం తమకు విభాగాధిపతులుగా రావాల్సిన అవకాశాలను కోల్పోతున్నామని తర్వాతి స్థాయిల్లో ఉన్న అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు విభాగాధిపతి వంటి పోస్టులు ఎప్పుడు లభిస్తాయని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ వారే..!
ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బి.నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శులుగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి కె.భూపాల్‌రెడ్డి, రిటైర్డ్ కేంద్ర సేవల అధికారి పి.రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్నారు. 2014 జూన్ 6 నుంచి తెలంగాణ జెన్‌కో సీఎండీగా, అదే ఏడాది అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతల్లో దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనసాగుతున్నారు.
టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీగా జి.రఘుమారెడ్డి 2014 జూలై నుంచి విధుల్లో ఉన్నారు. 2016 అక్టోబర్ నుంచి ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాల్‌రావు వ్యవహరిస్తున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరు ఈ పోస్టుల్లో కొనసాగుతారని ప్రభుత్వం జీవోల్లో పేర్కొనడం గమనార్హం. ముగ్గురు సీఎండీలు కూడా దశాబ్దకాలం కిందే విద్యుత్ సంస్థల్లో పదవీ విరమణ చేశారు. ఇక విద్యుత్ సంస్థల డైరెక్టర్లలో అత్యధిక శాతం మంది తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగుతున్నారు. వారి విషయంలోనూ పదవీ కాలాన్ని నిర్దేశించకుండా కొలువులను పొడిగించారు.
ఈఎన్‌సీలకు రిటైర్మెంటే లేదు!
రాష్ట్రంలో పలు కీలక ఇంజనీరింగ్ విభాగాల ఈఎన్‌సీలు రిటైరైనా.. ప్రభుత్వం ఆ పోస్టుల్లో వారినే కొనసాగిస్తోంది. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు 2011లో పదవీ విరమణ చేసి దశాబ్దకాలంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు మారినా, తెలంగాణ వచ్చాక కొత్త సీఎం వచ్చినా ఆయనకు పదవీకాలం పొడిగింపు లభించడం గమనార్హం.
రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఈ హమీద్ ఖాన్, అంతర్రాష్ట వ్యవహారాల ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు పదవీ విరమణ తర్వాత కూడా అదే హోదా/పోస్టుల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ జలమండలి ఈఎన్‌సీ/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి 2016 జూలైలో రిటైరైనా ఇంకా అదే పదవిలో ఉన్నారు. మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి 2017 నవంబర్‌లో రిటైరైనా నాలుగున్నరేళ్లుగా అలాగే కొనసాగుతున్నారు. ఆర్‌అండ్‌బీ విభాగంలో ఈఎన్‌సీ (జాతీయ రహదారులు, భవనాలు) బి.గణపతిరెడ్డి 2017 ఫిబ్రవరిలో, ఈఎన్‌సీ (స్టేట్ రోడ్లు) పి.రవీందర్‌రావు 2016 జూలైలో రిటైరై ఇంకా కొనసాగుతున్నారు.
అ‘విశ్రాంత’సేవలో మరికొందరు..
ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి 2017 నవంబర్‌లో రిటైరై ఇంకా కొనసాగుతున్నారు. ∙దేవాదాయ శాఖ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్‌కు మొదట రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. తర్వాత మళ్లీ పొడిగించారు. దానితోపాటు ఆయనకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా కూడా ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. ∙సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా రాజమౌళిని సైతం ఇటీవల తిరిగి నియమించారు.
∙యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, శిల్పారామం ప్రత్యేకాధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావు, మెట్రోరైలు శాశ్వత ఎండీగా ఐఆర్‌ఏఎస్ అధికారి ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ∙పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల రిటైరైన సీనియర్ ఐఏఎస్ అదర్ సిన్హా పదవీ కాలాన్ని గత నెలలోనే ప్రభుత్వం రెండేళ్లు పెంచింది. ∙ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీందర్, గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి ముత్యంరెడ్డి కూడా అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment