సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్ల్లలపై మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. చర్లపల్లి, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్ మండలాల పరిధిలోని పలు చెరువులు, కుంటల్లో వేసిన చేప పిల్లలు తక్కువ సైజుతో ఉండటంతో మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సరైన సైజు లేని నాసిరకం చేప పిల్లలను చెరువు కుంటల్లో వదలడంతో వాటి ఎదుగుదల సరిగా లేదని, దీంతో బలహీనంగా ఉన్న చేప పిల్లలు చనిపోతున్నట్లు చెబుతున్నారు.
మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం ఏటా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలపడతారన్న సంకల్పంతో ప్రభుత్వం జిల్లా మత్స్యశాఖ అధ్వర్యంలో చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పెంచుతోంది. చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరగానే జూలై నుంచి వీటి పంపిణీ చేయాల్సిన జిల్లా మత్స్యశాఖ సకాలంలో టెండర్లు పూర్తి చేయలేకపోవటం వల్ల సెప్టెంబర్ మూడవ వారం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటి వరకు 309 చెరువులు, కుంటల్లో 74.47 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ పంపిణీ చేసింది. అయితే వీటిలో ఏమాత్రం ఎదుగూ.. బొదుగూ లేక 20 నుంచి 30 శాతం చేప పిల్లలు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. చేప పిల్లల కొనుగోలు ఆర్థిక భారాన్ని మీద వేసుకున్న ప్రభుత్వం.. చెరువులు, కుంటల్లో వాటిని పెంచుకోవటానికి మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా అందజేసింది.
చేపల పంపిణీ లక్ష్యం 96.95 లక్షలు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 352 చెరువులు, కుంటలు చేప పిల్లల పెంపకానికి అనువుగా ఉన్నట్లు గుర్తించిన జిల్లా మత్స్య శాఖ 2021–22 సంవత్సరంలో 96.95 లక్షల చేప పిల్లల పంపిణీని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ చేప పిల్లల్లో 35 నుంచి 40 మి.మీ. ఉన్న చేప పిల్లలు 83.28 లక్షలుగా.. 80 నుంచి 100 మి.మీ. ఉన్న చేప పిల్లలు 13.67 లక్షలు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. తక్కువ సైజు, నాసిరకం చేపలు ఎక్కువ ఉన్నట్లు మత్స్యశాఖ సంఘాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ జిల్లా మత్స్యశాఖ ఇప్పటి వరకు 309 చెరువు, కుంటల్లో 74.47 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది.
62 మత్స్య సహకార సంఘాలు.. 3 వేల సభ్యులు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 62 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, ఇందులో 3 వేల వరకు సభ్యులున్నారు. ఈ ఏడాది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉన్న చెరువులతోపాటు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని చెరువులు, కుంటల్లో కూడా చేప పిల్లలను పెంచాలని జిల్లా మత్స్యశాఖ నిర్ణయించింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment