సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చెయిన్, మెషీన్ లెర్నింగ్, డ్రోన్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేకించి కృత్రిమ మేథస్సు (ఏఐ) రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ డొమైన్‌లో అగ్రస్థానం కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏఐ రంగంలో 200 ఆవిష్కర్తలు, స్టార్టప్‌లను ఆకర్షించడంతోపాటు భవిష్యత్తులో రూ. 2 లక్షల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
కృత్రిమ మేథో సంవత్సరంగా 2020
ఇప్పటికే ఈ సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు ఐటీ, విద్యాసంస్థలు, స్టార్టప్ కమ్యూనిటీ, పౌర సమాజం భాగస్వామ్యంతో ఆరు అంచెల వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన సంస్థలతో ఏఐ పరిశోధన, ఆవిష్కరణల కోసం ఐటీశాఖ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఒప్పందంలో భాగంగా పలు సంస్థలు రాష్ట్రంలో ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ది (ఆర్ అండ్ డీ) సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.
► హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌హెచ్‌ఐ), ఇంటెల్ భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ ఏఐ (క్రియా) ఏర్పాటైంది. వైద్య పరీక్షలు, ప్రజారోగ్యం, సప్లై చైన్ వంటి వాటిపై ఈ సెంటర్ దృష్టి పెడుతుంది. రవాణా, సెక్యూరిటీ, వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా సెట్లు, మల్టీ వెహికల్ సిస్టమ్‌పై పరిశోధన చేస్తుంది.
► క్వాలిటీ డేటా సెంటర్ల నిర్మాణంతోపాటు విద్య, శిక్షణ రంగాల్లో పరిశ్రమలు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏఐ కోర్సులకు అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేసేందుకు ఐఐటీ హైదరాబాద్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
► సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీఎఫ్‌ఐఆర్), వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలసి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ (ఏఐ4ఏఐ) ద్వారా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రయత్నం చేయనుంది.
► ఎన్‌విడియా భాగస్వామ్యంతో ఏర్పాటైన హై పర్ఫార్మెన్స్ ఏఐ కంప్యూటింగ్ (హెచ్‌పీఏఐసీ) ద్వారా ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల ఇంక్యుబేషన్‌కు తోడ్పాటు లభిస్తుంది.
► ఐఐటీ ఖరగ్‌పూర్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ద్వారా మ్యాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ), లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా పరిష్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.
► ప్రజారోగ్య రంగంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఆవిష్కరణల కోసం నాస్కామ్ భాగస్వామ్యంతో డేటా సైన్స్ అండ్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తోంది.
► ఏఐ రంగంలో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ)కి ఉన్న సూపర్ కంప్యూటర్ సౌకర్యాలను స్టార్టప్‌లు, ఇతరులు ఉపయోగించుకొనేందుకు ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment