నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
మూడు నెలల్లో రూ.16 వేల కోట్ల రుణాలను తీసుకునే యోచన
దాదాపు రూ.50 వేల కోట్లకు చేరిన గత ఆర్థిక సంవత్సరం పద్దు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల తొలి అప్పు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బహిరంగ మార్కెట్‌లో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం ఈ మేరకు రుణం తీసుకోనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్లకు పైగా నిధులను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం రూ.40వేల కోట్లకు పైగా రుణ సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా, ఆ పద్దు దాదాపు రూ.50 వేల కోట్లకు చేరడం గమనార్హం.
డిసెంబర్ నుంచి రూ.13 వేల కోట్లకు పైమాటే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పు రూ.13 వేల కోట్లు దాటింది. డిసెంబర్ 7 నుంచి మార్చి 31 వరకు తొమ్మిది దఫాల్లో బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాలను సమీకరించింది. గత ఏడాది డిసెంబర్ 12న రూ. 500 కోట్లు, డిసెంబర్ 19న రూ.900 కోట్లు, ఈ ఏడాది జనవరి 16న రూ.2,000 కోట్లు, అదే నెల 23న రూ.1,000 కోట్లు, ఫిబ్రవరి ఆరో తేదీన రూ.2,000 కోట్ల రుణాలను తీసుకుంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో చివరి మాసమైన మార్చిలో నాలుగు దఫాల్లో రూ.6,718 కోట్లకు పైగా రుణాలను సమీకరించింది.
మార్చి ఐదో తేదీన రూ.2,000 కోట్లు, అదే నెల 12న మరో రూ.2,000 కోట్లు, 19న రూ.1,000 కోట్లు, చివరిగా మార్చి 26న రూ.1,718 కోట్ల అప్పులు తీసుకుంది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం (జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో రూ.11,718 కోట్ల రుణం సమకూర్చుకుంది. కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.36,536.01 కోట్ల రుణాలు తీసుకుంది. ఆ తర్వాత తీసుకున్న అప్పులతో కలిపితే ఈ మొత్తం రూ.48 వేల కోట్లకు చేరడం గమనార్హం.
ఈ నెలలో మరో రూ.4 వేల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంలో రూ.16 వేల కోట్ల రుణాలను తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించనున్న రుణాల వివరాలను ఆర్బీఐ మార్చి 28న వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఏప్రిల్ 2న రూ.1,000 కోట్లు, 8, 23 తేదీల్లో రెండు దఫాలుగా రూ.2 వేల కోట్ల చొప్పున ఒక్క నెలలో రూ.5 వేల కోట్లు తీసుకోనుంది.
మే నెలలో 7, 14, 28 తేదీల్లో మూడు దఫాలుగా రూ.6 వేల కోట్లు, జూన్ 4వ తేదీన రూ.1000 కోట్లు, 11, 25 తేదీల్లో రెండు దఫాలుగా రూ.4 వేల కోట్లను అప్పుగా తీసుకోనుంది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున రూ.5 వేల కోట్ల వరకు అప్పులను సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment