సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొంటామని పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.
జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఈసారి రైతుల నుంచి కోటి టన్నుల మేర ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉన్నందున, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, వర్షం కురిసినా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లను పంపిస్తామని చెప్పారు.
గన్నీ బ్యాగుల గురించి, కొనుగోలు కేంద్రాల గురించి జరుగుతున్న దుష్ప్రచారాలను పట్టించుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి రవాణా సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, కోతల తీరును బట్టి జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,033 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment