సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు భారీ ఊరట లభించింది. పాఠశాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏమవతుందోనని గత పది రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారులు రిలీఫ్‌నిచ్చారు.
గత నెల 18వ తేదీన స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ ఇదే పాఠశాలలో చదువుతున్న నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిని, ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాఠశాలలో నిర్లక్ష్యం తాండవం చేస్తోందంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
గత నెల 22వ తేదీన స్కూల్ అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్కూల్‌ను బంజారాహిల్స్‌లోని పాత భవనంలోనే కొనసాగించాలంటూ గత నెల 23వ తేదీన 650 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సమావేశమై భారీ ఆందోళన చేపట్టారు. ఆ రోజు నుంచే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు డీఈఓ రోహిణిని కలుస్తూ ఇక్కడే పాఠశాలను రీ ఓపెన్ చేయాల్సిందిగా డిమాండ్ చేయసాగారు.
బ్యాలెట్‌తో అభిప్రాయ సేకరణ..
మొత్తం తల్లిదండ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ పిల్లలను ఇదే స్కూల్‌లో చదివించేందుకు అనుమతించాలంటూ ఇక్కడే స్కూల్ ఓపెన్ చేయాలని అభిప్రాయ సేకరణకు బ్యాలెట్ పద్ధతిని నిర్వహించారు. ఇందుకు 95 శాతం మంది తల్లిదండ్రులు మద్దతిచ్చారు. తల్లిదండ్రులంతా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తల్లిదండ్రులతో కూడిన ఓ కోర్ కమిటీ కూడా ఏర్పడింది. వీరు ప్రతిరోజూ సంబంధిత అధికారులను కలుస్తూ స్కూల్‌ను తెరవాలంటూ డిమాండ్ చేయసాగారు.
ఇటీవలే ఢిల్లీ నుంచి స్కూల్ డైరెక్టర్ నిషా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డీఈఓ కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఎట్టకేలకు స్కూల్ రీఓపెన్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా గురువారం నుంచి బంజారాహిల్స్‌లోనే స్కూల్ తెరవనున్నారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందని కోర్ కమిటీ ప్రతినిధి పెద్దల అంజిబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment