
సాక్షి, హైదరాబాద్ : కంటైన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లను 50% సీటింగ్ సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తెరిచేందుకు కేంద్రం గత అక్టోబర్ 30నే అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తెరవాల్సిన తేదీలను తర్వాత ప్రకటిస్తామని అప్పట్లో పేర్కొంది. తాజాగా వీటికి అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
పాటించాల్సిన నిబంధనలు ఇవే...
►ప్రేక్షకులు, సిబ్బంది సహా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
►ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
►భౌతిక దూరం పాటించాలి
►ప్రతి ఆట తర్వాత శానిటైజ్ చేయాలి.
►24 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ మధ్య ఏసీలను సెట్ చేయాలి. గాలి లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
►వేర్వేరు ఆటలకు సంబంధించిన విరామాలు ఒకే సమయంలో ఉండకుండా ఆటల వేళలను నిర్ణయించాలి.
ప్రముఖుల హర్షం..
థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వడంపై ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ తాండ్ర ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మూడునాలుగు రోజుల్లో థియేటర్లు ప్రారంభిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment