సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకొచ్చాం
వ్యయం, బెనిఫిట్ కాస్ట్ రేషియో అప్రూవల్స్ కూడా తెచ్చాం
2026, ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం
విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడానికి అను మతిస్తూ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హైడ్రాలజీ క్లియరెన్స్ జారీ చేసిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు అనుమతులపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని విజయం సాధించిందన్నారు.
ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు పంప్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. మంగళవారం ఆయన జలసౌధలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు కేవలం రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, కమీషన్లు, పర్సెంటేజీల కక్కుర్తితో రీఇంజనీరింగ్ చేపట్టి రెండు ప్రాజెక్టులను సమీకృతం చేసి సీతారామ ప్రాజెక్టుగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నామకరణం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు.
ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,286 కోట్లకు పెంచి ఐదింతలు చేసిందని మండిపడ్డారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల ద్వారా 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదని, సీతారామ ప్రాజెక్టు అంచనా వ్యయం ఐదింతలు పెంచినా ఆయకట్టు 3.29లక్షల ఎకరాలకు తగ్గిందన్నారు. పంప్‌హౌస్‌ల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని 349 మెగావాట్ల నుంచి 694 మెగావాట్లకు, సేకరించాల్సిన భూములను 2,482 ఎకరాల నుంచి 3,656 ఎకరాలకు పెంచడంతో ఆర్థికభారం పెరిగినా ఒక్క ఎకరా ఆయకట్టు పెరగలేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టుపై రూ.7,436 కోట్ల వ్యయంతో 39శాతం పనులను మాత్రమే పూర్తి చేసిందని, 90శాతం పనులు పూర్తిచేశామని హరీశ్‌రావు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సాధించినట్టు హరీశ్ చెప్పుకోవడంలో వాస్తవం లేదన్నారు. ప్రాజెక్టు వ్యయ అంచనాలు, బెనిఫిట్ కాస్ట్ రేషియోలకు సైతం తామే అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు.
సీతారామ ప్రాజెక్టు పనులను 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. త్వరలో జరగనున్న గోదావరిబోర్డు సమావేశంలో ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తే..తదుపరి సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) అనుమతి కోసం డీపీఆర్ వెళుతుందని, దీంతో ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్టేనని ప్రకటించారు.
కమీషన్లు వచ్చే పనులే చేశారు : పొంగులేటి
హరీశ్‌రావు చెప్పుకున్నట్టు సీతారామ ప్రాజెక్టు మోటార్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే బిగించిందని, మోటార్లకు ఎక్కువ కమీ షన్లు, లాభాలు వస్తాయనే ఆ పనులు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రూ.430 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు మోటార్ల డ్రై రన్ నిర్వహించలేదన్నారు. ఖమ్మం జిల్లాపై ఎంత ప్రేమ ఒలకబోసినా జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్ నేతల మాటలను నమ్మరని స్పష్టం చేశారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఆ పారీ్టకి జిల్లా ప్రజలు ఒకటే సీటు ఇచ్చారని, ఇకపై ఆ ఒక్క సీటు ఇవ్వబోరని తెలిపారు.
నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పనులను దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 75% పూర్తి చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్ తామే చేసినట్టు పత్రికల్లో యాడ్స్ జారీ చేసిందన్నారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అవసరాలకు సాగర్ టెయిల్‌పాండ్‌లోకి గోదావరి నీళ్లను ఎత్తిపోయాలని వైఎస్ ప్రభుత్వం నాడే నిర్ణయం తీసుకుందని, దీనిని కొత్తగా హరీశ్‌రావు సూచించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్‌సీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment