వైద్య శాఖలో నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే  | Telangana Health Department Posts Recruitment Delay ST Reservations | Sakshi
Sakshi News home page

వైద్య శాఖలో నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే 

Published Wed, Oct 5 2022 12:09 PM | Last Updated on Wed, Oct 5 2022 3:18 PM

Telangana Health Department Posts Recruitment Delay ST Reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పరిధిలో పోస్టుల నోటిఫికేషన్లు వాయిదా పడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి రోస్టర్‌ వివరాలు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నాయి. దీనికి ఎన్ని రోజులు పడుతుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా 10,028 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
చదవండి: టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌ 'మరో ప్రస్థానం'

అందులో ఇప్పటికే 969 ఎంబీబీఎస్‌ అర్హతగల సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 211 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారం అర్హత సాధించిన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చినందున యథాతధంగా భర్తీ ప్రక్రియ జరగనుంది.

9 వేల పోస్టుల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపు 
ఎంబీబీఎస్‌ అర్హత కాకుండా స్పెషలిస్టు వైద్యులు, నర్సింగ్, ఏఎన్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కావాల్సి ఉంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ పూర్తయ్యాక వీటికి నోటిఫికేషన్లు జారీ చేయాలని బోర్డు భావించగా.. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో వాయిదా పడ్డాయి. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి రోస్టర్‌ వివరాలు అందాక విడతల వారీగా 9వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేస్తామని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల ప్రకారం.. ఈ పోస్టుల్లో 900కుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement