
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణతోపాటు ‘ఒమిక్రాన్’కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులకు వైద్యం అందించేందుకు నిలోఫర్ ఆసుపత్రి మాత్రమే ఉన్న నేపథ్యంలో మరో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాజకీయ పార్టీలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.
అలాగే షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు, వారాంతపు సంతలు, ఇతర జన సమూహ ప్రాంతాల్లో ఆంక్షలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలితో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒమిక్రాన్‌తోపాటు కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలను టీఆర్‌ఎస్ పార్టీ పాటించడం లేదని, రైతుబంధు సంబరాల పేరుతో వారం రోజులపాటు పెద్ద ఎత్తున సమావేశం అవుతున్నారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఆరోపించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మాత్రమే విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment